- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఎగుమతుల సామర్థ్యం పెంచండి
తెలంగాణ ఎగుమతుల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

- కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎగుమతుల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, ఔషధాలు, వైద్య పరికరాలు, వస్త్ర పరిశ్రమ, ప్రత్యేక ఆర్థిక మండలాలు తదితర రంగాల్లో నాణ్యత, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించాలని కోరారు. నిజామాబాద్ ప్రాంతంలో అధిక దిగుబడి, అధిక కర్కుమిన్ శాతం కలిగిన పసుపు విత్తనాల అభివృద్ధికి పరిశోధన చేపట్టాలని.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ప్రతిపాదించారు. అలాగే పసుపు ఆరబెట్టడం, నూనె తయారీ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తే ఎగుమతులకు మరింత ఊతమిస్తుందని సూచించారు.
కరీంనగర్‌లో స్పైస్ బోర్డు ల్యాబ్
పసుపు, మిర్చి, అల్లం వంటి సుగంధ ద్రవ్యాల నాణ్యత పరీక్షల కోసం కరీంనగర్ జిల్లాలో స్పైస్ బోర్డు ప్రయోగశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల ఎగుమతుల సమయంలో అవసరమైన నాణ్యత ధృవీకరణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పెంచేందుకు ఆధునిక ప్యాక్‌హౌస్‌తో కూడిన ఇర్రాడియేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వరంగల్ లేదా ఆదిలాబాద్‌లో పత్తి నాణ్యత పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ఔషధ పరిశ్రమకు మద్దతుగా అత్యాధునిక వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్, మెడికల్ డివైజ్‌ల కోసం కామన్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం విశాఖపట్నంలో మాత్రమే ఉన్నదని.. తెలంగాణ పారిశ్రామిక, ఎగుమతి రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఎదిగిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2025-26లో తెలంగాణ ఎగుమతులు రూ.2.20 లక్షల కోట్లకు చేరగా, రాష్ట్రంలో 50 ఎస్‌ఈజెడ్‌లు, 313 ఆపరేషనల్ యూనిట్లు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో అదనపు ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలు, మరో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ప్రత్యేక లాజిస్టిక్స్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఎగుమతిదారుల రవాణా వ్యయాలు తగ్గడంతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
కంటైనర్ తయారీ క్లస్టర్‌కు ప్రతిపాదన
దేశంలో కంటైనర్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకం కింద తెలంగాణలో కంటైనర్ తయారీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కూడా శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, స్టీల్ ఫ్యాబ్రికేషన్ రంగాలకు ఇది కొత్త అవకాశాలను తీసుకువస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలన్నింటికి కేంద్రం ఆమోదం తెలపాలని, తద్వారా తెలంగాణ ఎగుమతుల సామర్థ్యం, నాణ్యత, అంతర్జాతీయ పోటీతత్వం మరింత పెరుగుతుందని విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. ఎరాడిషన్ ఫెసిలిటీ, టెస్టింగ్ ల్యాబరేటరీ ప్రతిపాదనపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు. ఈ అంశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉందని కితాబునిచ్చారు.






