దద్దరిల్లిన తెలంగాణ సచివాలయం.. ఫీజు బకాయిల కోసం వామపక్ష విద్యార్థి సంఘాల పోరు

by Ramesh Naini |   (  Updated:2026-07-14 15:58:25  IST  )

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది.

దద్దరిల్లిన తెలంగాణ సచివాలయం.. ఫీజు బకాయిల కోసం వామపక్ష విద్యార్థి సంఘాల పోరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐడీఎస్‌వో, ఏఐపీఎస్‌యూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముట్టడిలో వందలాది మంది విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. సచివాలయం వైపు భారీగా తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పలువురు నాయకులను ముందస్తుగా నిర్బంధించగా, మరికొందరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో లాఠీఛార్జ్ జరిగినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. దీంతో సచివాలయం పరిసర ప్రాంతాలు విద్యార్థుల నినాదాలతో మార్మోగాయి.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు నిలిపివేస్తూ విద్యార్థులను వేధిస్తున్నాయని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఏకకాలంలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Next Story