- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. చివరి క్షణంలో మంత్రి పొన్నం ప్రకటన!
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటకు రెడీ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 21 అర్ధరాత్రి) నుంచే సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటకు రెడీ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 21 అర్ధరాత్రి) నుంచే సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే సోమవారం సాయంత్రం వరకు సమ్మెపై చర్చలకు పిలవని ప్రభుత్వం.. ఒక్కసారిగా కాళేశ్వరం సభలో మంత్రి పొన్నం వ్యాఖ్యలతో చర్చలకు అవకాశం ఏర్పడింది. ఒకవేళ బంద్ జరిగితే రోజూ ప్రయాణిస్తున్న లక్షలాది మంది మహాలక్ష్ములకు తీవ్ర ఇబ్బందులు తప్పవనే సంకేతాల నేపథ్యంలోనే మంత్రి పొన్నం చర్చల అంశాన్ని చివరి క్షణంలో తెరపైకి తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ సహా పలు డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమ్మె సంకేతాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దమయ్యాయి. ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని ఆర్టీసీ జేఏసీ సమ్మెపై తీవ్రంగా కసరత్తు చేసింది. అన్ని డిపోల పరిధిలో మీటింగులు ఏర్పాటు చేసి కార్మికులను సన్నద్ధం చేశారు. అయితే సమ్మెకు దూరంగా ఉంటూ వచ్చిన మరో జేఏసీ (అశ్వథ్థామరెడ్డి వర్గం) సైతం తాము కూడా సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించింది. వీరితో సహా మిగతా కార్మిక సంఘాలు సైతం సమ్మెకే సై అంటున్నాయి. అదే జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావాలన్నది ఆర్టీసీ జేఏసీ నేతల మాట. ప్రభుత్వంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని... అందుకే సమ్మె తప్ప వేరే గత్యంతరం లేదని జేఏసీ నేతలు చెబుతున్నారు.
చివరి క్షణంలో మంత్రి పొన్నం ప్రకటన..
ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన డిమాండ్లు అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ విషయంలోనే పేచి వస్తోంది. ఈ రెండు తమ పరిధిలో లేవని మంత్రి పొన్నం ప్రకటించిన తర్వాతే సమ్మెపై జేఏసీ స్పష్టమైన పిలుపునిచ్చింది. ఈ ప్రధాన డిమాండ్ల విషయంలో జేఏసీ నేతలు పట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తే ప్రభుత్వానికి లేని తలనెప్పి ఎందుకని భావించినట్లు సమాచారం. అందుకే కాళేశ్వరం సభ వేదికపై మంత్రి పొన్నం ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, అందులో 35 లక్షల మంది మహిళలు, 35 లక్షల కి.మీ ప్రయాణం, 10వేల బస్సులతో పేద ప్రజలకు ఆర్టీసీ బస్సు లైఫ్ లైన్ అని.. దీనిని ఆగిపోనివ్వమని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని అన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ మీదే తమ దృష్టి అని తెలిపారు. సమ్మెకు సిద్ధమవుతున్న వారిని సంప్రదించి సమ్మె లేకుండా చేస్తామన్నారు. మంగళవారం చెన్నై నుంచి డిఫ్యూటీ సీఎం వచ్చాక ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు.






