ఆర్టీసీలో సమ్మె సైరన్: మళ్లీ స్తంభించిపోనున్న ప్రజా రవాణా!

by Gantepaka Srikanth |

రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి సమ్మె సెగ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్టీసీలో సమ్మె సైరన్: మళ్లీ స్తంభించిపోనున్న ప్రజా రవాణా!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి సమ్మె సెగ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమ చిరకాల వాంఛ అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కార్మిక జేఏసీ (JAC) నాయకులు కాసేపట్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రధాన డిమాండ్లు ఇవే:

= ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వ విభాగంగా గుర్తించి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి.

= దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను తక్షణమే అమలు చేయాలి.

= రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ మరియు పెండింగ్‌లో ఉన్న డీఏ (DA) బకాయిలను విడుదల చేయాలి.

= సంస్థను బలోపేతం చేసేందుకు కొత్త బస్సులను ప్రవేశపెట్టాలి మరియు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..

గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. "ఎన్నో ఏళ్లుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నా, మా బతుకుల్లో మార్పు రావడం లేదు. విలీనం ప్రక్రియను వేగవంతం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా చక్రాగిపోక తప్పదు" అని జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. అయితే.. ఒకవేళ ఈ సమ్మె గనుక జరిగితే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు పిలుస్తుందో లేక కఠినంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.

Next Story