రెవెన్యూశాఖలో అక్రమ పదోన్నతులు.. అర్హులకు అన్యాయం!

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర రెవెన్యూ శాఖలో అంతా మాయాజాలం.. అటు భూ దందాలు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్‌లోనే కాదు. ఆఖరికి సర్వీస్ అంశాల్లోనూ అనేక వింతలు చోటు చేసుకున్నాయి.

రెవెన్యూశాఖలో అక్రమ పదోన్నతులు.. అర్హులకు అన్యాయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రెవెన్యూ శాఖలో అంతా మాయాజాలం.. అటు భూ దందాలు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్‌లోనే కాదు. ఆఖరికి సర్వీస్ అంశాల్లోనూ అనేక వింతలు చోటు చేసుకున్నాయి. కొందరు తహశీల్లార్లను ఏకంగా డీఆర్వోలుగా నియమించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందకుండా మరికొందరిని పెద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. అర్హతలతో సంబంధం లేకుండా బదిలీలు, పదోన్నతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతున్నా ఉన్నతాధికారులకు భయపడి నోరు మెదపడం లేదు. ఎక్కడ తమపై యాక్షన్ తీసుకుంటారోనని ఐఏఎస్ అధికారుల ముందు గళం విప్పడం లేదు. రెవెన్యూ శాఖలో క్వాలిటీ హ్యూమన్ రీసోర్స్ తగ్గడం, ఎలాంటి శిక్షణా తరగతులు, ఓరియెంటేషన్ లేకుండానే పనుల అప్పగింత వల్ల సమస్యలు ఎక్కడక్కడే ఉంటున్నాయి. ఆర్వోఆర్-2020, ఆర్వోఆర్-2025 అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులకు, సిబ్బందికి ఎలాంటి ప్రత్యేక ఓరియెంటేషన్, శిక్షణ ఇవ్వలేదు. ఆఖరికి మీ సేవా కేంద్రం నిర్వాహకులకు కూడా మాడ్యూళ్ల గురించి వివరించలేదు. అందుకే భూ భారతి దరఖాస్తులను పెద్ద ఎత్తున రిజెక్ట్ చేస్తున్నారని ఎంప్లాయీస్ చెబుతున్నారు. సమస్యలకు పరిష్కారం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం వల్లే పెండింగులో పెట్టడం, లేదంటే రిజెక్ట్ చేయడమో జరుగుతుందంటున్నారు.

నాయబ్ తహశీల్దార్లకు అన్యాయం

2015‌‌–16 ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపికైన ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్లకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. తాము టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ నెం.20/2015కు అనుబంధంగా జారీ చేసిన నోటిఫికేషన్ నెం.17/2016, తేదీ 01.09.2016 ద్వారా ఎంపికయ్యాం. ఐతే 2016లో ఎంపికైనప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాల ఆలస్యంతో 2020 ఫిబ్రవరి 13న మాత్రమే నియామకం పొందినట్టు చెప్పారు. 2021 ఏప్రిల్ ఒకటో తేదీన జిల్లాలను కేటాయించారు. నియామకం నాటి నుంచి పోస్టింగులు, పదోన్నతులు, సీనియారిటీ, జోనల్ కేటాయింపుల విషయంలో నిరంతర సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ప్రోడీటీలు(డైరెక్ట్ రిక్రూట్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తున్న నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారానికి సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎంకు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రత్యక్ష నియామక ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్లు అర్జీ పెట్టుకున్నారు. 2020 బ్యాచ్ ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్ల పదోన్నతి అంశంపై దృష్టి పెట్టాలని వేడుకున్నారు. గతంలో గ్రూప్-II ద్వారా నియమితులైన నాయబ్ తహశీల్దార్లు, వారికి కేటాయించిన 30% ప్రత్యక్ష నియామక కోటా, సీనియారిటీ ఆధారంగా సాధారణంగా మూడు సంవత్సరాలలో తహశీల్దార్లుగా పదోన్నతి పొందేవారు. ఐతే తాము ఎంపికై ఆరు సంవత్సరాలకు పైగా గడిచినా పదోన్నతి అవకాశాలు ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయని బాధ పడుతున్నారు.

పదాల్లో మతలబు

ప్రత్యక్ష నియామక ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్లకు అన్యాయం జరగడానికి గల ప్రధాన కారణం రెవెన్యూ (సర్వీసులు-II) శాఖ జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.1835, తేదీ 04.11.2011. ఈ జీవోకి ముందు ప్రతి పది ఖాళీలలో మూడు నాయబ్ తహశీల్దార్ పోస్టులు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయబడేవి. దీని వల్ల అర్హత కలిగిన యువతకు రెవెన్యూ శాఖలో అవకాశం లభించేది. అయితే "Substantive Vacancies" అనే పదాన్ని "Substantive Posts"గా మార్చడం వల్ల ప్రత్యక్ష నియామకుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని నాయబ్ తహశీల్దార్లు అంటున్నారు. దీని ఫలితంగా ప్రత్యక్ష నియామకాలు ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలకు అనుసంధానంగా లేకుండా పోయాయి. దీంతో ర్యాంక్ ప్రమోటీలకు అనవసర ప్రయోజనం కలిగి, ప్రత్యక్ష నియామక నాయబ్ తహశీల్దార్ల సీనియారిటీ, పదోన్నతి అవకాశాలు ప్రభావితమయ్యాయంటున్నారు. ఈ విధానం కేవలం నాయబ్ తహశీల్దార్ పోస్టుకే వర్తించడం గమనార్హం. ఇతర శాఖలలో లేదా కేడర్లలో ఇటువంటి నిబంధన లేదు. అందుకే జీవో 1835 అమలు కొనసాగించడం ప్రత్యక్ష నియామకాలను ప్రోత్సహించే ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా ఉందంటున్నారు. అలాగే, 2012 నుంచి 2020 వరకు ప్రత్యక్ష నియామకాలు జరగకపోవడంతో అప్పటి జోన్-V, జోన్-VIలలో ప్యానెల్ సంవత్సరాల్లో పోస్టుల సంఖ్య కృత్రిమంగా పెరిగినట్లు కనిపిస్తోంది. దీని వల్ల సీనియారిటీ, పదోన్నతుల విషయంలో ర్యాంక్ ప్రమోటీలకు అనవసర ప్రయోజనం కలిగింది. అందుకే ఈ అంశాలపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో తాము హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

స్టేటస్ కో..

పదోన్నతుల విషయంలో హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసినప్పటికీ భూ పరిపాలన కమిషనర్ 2017-18 ప్యానెల్‌ను ఆమోదించారని పీడీటీలు ఆరోపిస్తున్నారు. తమ నియామకం తర్వాత పదోన్నతి పొందిన పలువురు ర్యాంక్ ప్రమోటీ నాయబ్ తహశీల్దార్లను కూడా సీనియారిటీ జాబితాలో మాకంటే పై స్థాయిలో ఉంచారు. దాంతో పాటు సంబంధిత ప్యానెల్ సంవత్సరం వరకు సీనియర్ అసిస్టెంట్లుగా కొనసాగిన కొందరికి కూడా తమ కంటే అధిక సీనియారిటీ ఇచ్చారని చెప్పారు. అదనంగా జీవో 317 ప్రకారం జరిగిన జోనల్ పునర్వ్యవస్థీకరణలో అనేక మంది ప్రత్యక్ష నియామక ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్లకు స్వస్థల జోన్ కాకుండా ఇతర జోన్లు కేటాయించారన్నారు. ఈ లోపాల కారణంగా తాము తీవ్రమైన శారీరక, ఆర్థిక, కుటుంబ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సీఎంకి రాసిన లేఖలో వివరించారు. ప్రధానంగా మహిళా అధికారులు దూర ప్రయాణాలు చేయడం, కుటుంబాలకు దూరంగా ఉండటంతో వల్ల తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న ఆలస్యం తమకు మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తోందని పేర్కొన్నారు.

అర్హతలు ఉన్నాయా?

రెవెన్యూ శాఖలో ఎలాంటి శిక్షణ లేకుండానే అండర్ క్వాలిఫైడ్ వాళ్లను తీసుకోవడం ప్రజలకు, ప్రభుత్వానికి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ప్రత్యక్ష నియామకపు ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముగిసిపోయిన ప్యానెల్ ఇయర్స్‌లో జూనియర్స్‌ని తీసుకొచ్చి డైరెక్ట్ రిక్రూట్స్‌పైన కూర్చోబెట్టడం ద్వారా తప్పుడు ప్రమోషన్లు ఇచ్చారు. ఇలా తప్పుడు ప్రమోషన్లు ఇవ్వడంతో డైరెక్ట్ రిక్రూటీ నాయబ్ తహశీల్దార్లు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ లాయర్ల ద్వారా కేసులు పరిష్కారం పైన దృష్టి పెట్టకుండా కోర్టు ప్రమోషన్లపైన స్టే ఇచ్చిందనే పేరుతో ఎక్కడ లేని వింత ఆదేశాల ద్వారా జూనియర్స్‌ని సీనియర్స్‌పై కూర్చోబెడుతూ ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

అక్రమ పదోన్నతులు

ఇటీవల తహశీల్దార్లను ఆర్డీవోలపై డీఆర్వోలుగా కూర్చొబెట్టారు. ప్రమోషన్ అనే పదం వాడకుండా, పే స్కేలు మార్చకుండా నాయబ్ తహశీల్దార్లను తహశీల్దార్లుగా పక్క జిల్లాలకు బదిలీ చేశారు. ఈ ఆదేశాల్లో పేర్కొన్న నియమాలు కూడా ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగులో ఉన్న వాళ్ళు రాజకీయ పరపతి ఉపయోగించి ప్యానెల్‌లో చేరి ప్రమోషన్ పొందటంతో రెవెన్యూ శాఖలో గందరగోళం నెలకొంటుందన్నారు. సీసీఎల్ఏలో సర్వీసు విషయాలు చూసుకునే సెక్షన్‌లో ఏండ్ల తరబడి తిష్టవేసి కూర్చున్నారు. ఇన్ని అవకతవకలకు లాంగ్ స్టాండింగ్ అధికారులేనని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ శాఖలో క్వాలిటీ హ్యూమన్ రీసోర్స్‌తో పాటు సరైన శిక్షణ ఉన్నప్పుడే క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అర్హత లేకపోయినా జిల్లా స్థాయి పోస్టులకు ఎలా బదిలీ చేస్తారన్న చర్చ నడుస్తూనే ఉన్నది. ఆర్డీవోలకు తహశీల్దార్లను బాస్‌లుగా చేసిన వింత భూ పరిపాలన మరెక్కడా లేదంటున్నారు. ఐతే ఈ విషయంపై బహిరంగంగా విమర్శిస్తే ఎక్కడ తమపై చర్యలు తీసుకుంటారోనన్న భయపడుతున్నారు. ఐతే ఈ అక్రమ పద్ధతిలో పదోన్నతులు కల్పించిన అంశం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి దృష్టిలో ఉందో లేదో తెలియదంటున్నారు. ఆయనకు తెలిసి జరగకపోవచ్చునని, ముందు ఈ ప్రతిపాదన చెప్పి ఉంటే ఆయన ససేమిరా అనే వారన్న అభిప్రాయం ఉన్నది.

Next Story