- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏళ్లుగా దారి కోసం నిరీక్షణ..
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్నగుడిపేట (తెనుగుపల్లె) గ్రామం దశాబ్దాలుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్నగుడిపేట (తెనుగుపల్లె) గ్రామం 60ఏళ్లుగా దారి సౌకర్యం లేక తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. భౌగోళికంగా ఈ గ్రామం బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నా ఇక్కడి ఓట్లు మాత్రం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ వింతైన సరిహద్దుల విభజన కారణంగా ఇటు బెల్లంపల్లి, అటు సిర్పూర్ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేక పల్లె అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. వడాల గ్రామం వరకు ఉన్న 5 కిలోమీటర్ల కచ్చా రోడ్డు వర్షాకాలంలో బురదమయంగా మారడంతో, ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయి రాకపోకలు బంద్ అవుతున్నాయి. రవాణా కష్టాల వల్ల విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు నిత్యం ఆటోలకు వందల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఇరు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి శాశ్వత రోడ్డు వేసి కన్నీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్నగుడిపేట (తెనుగుపల్లె) గ్రామం దశాబ్దాలుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 60ఏళ్లుగా ఈ గ్రామం సరైన రహదారి లేక నరకయాతన అనుభవిస్తోంది. భౌగోళికంగా ఈ గ్రామం మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోకి (ఎమ్మెల్యే గడ్డం వినోద్) వస్తుంది. కానీ, ఇక్కడి ఓట్లేమో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్ నియోజకవర్గానికి (ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు) కేటాయించారు. ఈ వింతైన విభజన వల్లే గ్రామాభివృద్ధి పూర్తిగా పడకేసిందని, రెండు నియోజకవర్గాల మధ్య తమ బతుకులు నలిగిపోతున్నాయని సుమారు 2,200 జనాభా కలిగిన ఈ పల్లె జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బురదమయంగా మారిన బాటలు...
ఈ గ్రామ ప్రజలు నిత్యం బెల్లంపల్లి నియోజకవర్గానికి లేదా మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొరుగునే ఉన్న వడాల గ్రామం వరకు వెళ్లేందుకు కనీసం 5 కిలోమీటర్ల మేర సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు మట్టి రోడ్డు వేయిస్తామని హామీలు గుప్పించినా ప్రస్తుతం వర్షాకాలంలో అది కాస్తా బురదమయంగా మారి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా ఇప్పుడు వర్షాలు పడితే గ్రామానికి రాలేని దుస్థితి నెలకొన్నది. దీంతో గత్యంతరం లేక అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేయలేక నరకం చూస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
చదువు కోసం జేబులు ఖాళీ...
మరోవైపు గ్రామంలోని విద్యార్థులు చదువుకోవడానికి పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. మండల కేంద్రంలో కనీసం ఒక ఇంటర్ ప్రభుత్వ కళాశాల నిర్మించాలని ఏళ్లుగా వినతులు సమర్పిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు దూర ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యం ప్రయాణాల కోసం ఆటోలకు రూ.వందలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పేద కుటుంబాలైన తమకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారిందని, కొందరు ఆర్థిక ఇబ్బందులతో చదువులను కూడా మధ్యలోనే ఆపేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన...
రెండు జిల్లాల నడుమ రెండు ముక్కలైన చిన్నగుడిపేటతోపాటు దహేగాం మండలంలోని కేస్లాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలకు కూడా ఇదే విధమైన కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చి గెలిచిన నాయకులు ఆ తర్వాత రెండేళ్లు గడుస్తున్నా గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇరు జిల్లాల అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీష్ బాబు పరస్పర సమన్వయంతో స్పందించి, తమ గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించి రవాణా కష్టాల నుంచి విముక్తి కల్పించాలని చిన్నగుడిపేట ప్రజలు వేడుకుంటున్నారు.






