ఎస్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్!

by Kodari Anjali |

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ‘ఎస్ఐఆర్’ ఓటరు నమోదు, ప్రక్షాళన ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులలో గుబులు రేపుతోంది.

ఎస్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్!
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 24తో నమోదు గడువు ముగుస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు 50శాతం పనులు కూడా పూర్తి కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఎవరూ కూడా హైదరాబాద్ రావద్దని ఆదేశించారు. బుధవారం నుంచి నాయకులంతా తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి, బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ), కార్యకర్తలతో కలిసి ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో నిరంతరం మైక్ అనౌన్స్‌మెంట్లు, విస్తృత ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను స్థానిక నేతలే తీసుకోవాలని సూచించారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పురోగతి ఉందో తెలుసుకునేందుకు ఏ రోజుకారోజు తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలని మంత్రి జూపల్లి ఆదేశాలు జారీ చేశారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ‘ఎస్ఐఆర్’ ఓటరు నమోదు, ప్రక్షాళన ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులలో గుబులు రేపుతోంది. ఈ కార్యక్రమం అమలుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కాంగ్రెస్ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జిలు ఎవరూ కూడా రాజధాని హైదరాబాద్ వైపు రావద్దంటూ ఆయన హుకుం జారీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ నేతల్లో కనిపించని పట్టింపు...

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ కారణంగా పెద్ద సంఖ్యలో తమ మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఆ పట్టింపు కరువైందన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామ, మండల, వార్డు స్థాయిల్లో కమిటీలను చైతన్యం చేసి ఓటర్ల నమోదును పర్యవేక్షించాలని టీపీసీసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ మంత్రి వివేక్ సహా ఎమ్మెల్యేలు వినోద్, బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్ రావుతోపాటు డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జిలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నియోజకవర్గ కేంద్రాల్లో నామమాత్రపు సమావేశాలు నిర్వహించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటరు నమోదుపై శ్రద్ధ పెట్టకపోవడంతో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50శాతం నమోదు కూడా పూర్తి కాలేదు. ఈ నెల 24వ తేదీతో ఈ గడువు ముగియనుండడంతో కాంగ్రెస్ వర్గాల్లో అలజడి మొదలైంది.

గ్రామాల బాట పట్టండి.. మైకులతో ప్రచారం చేయండి...

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ ముఖ్య నేతలందరికీ బుధవారం ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలని, మైక్ అనౌన్స్‌మెంట్లు, ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. బూత్ లెవెల్ అధికారులతో (బీఎల్ఓ) కలిసి వార్డు, గ్రామ కమిటీల నాయకులు సమన్వయం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ముగిసేదాకా ఎవరూ హైదరాబాద్‌లో కనిపించవద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు.

ఏ రోజుకారోజు ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ పంపాల్సిందే...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రతిరోజు జరిగే ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై మంత్రి జూపల్లి రోజువారీ సమీక్షలు నిర్వహించనున్నారు. ఏ నియోజకవర్గంలో ఎంత ప్రోగ్రెస్ ఉంది? ఎక్కడ కార్యక్రమాలు చేపట్టారు? కొత్తగా ఎంత మంది పేర్లు చేర్పించారు? బీఎల్ఓలు సహకరిస్తున్నారా? క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్న నాయకులు ఎవరు? అనే పూర్తి నివేదికను ఏ రోజుకారోజు తనకు సమర్పించాలని జూపల్లి ఆదేశించారు. దీంతో బుధవారం నుంచి 24వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ పనుల్లో మునిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Next Story