గూడెంపై ఫోకస్ ..కొత్తగూడెనికి పార్టీల అగ్రనేతల రాక

by Ajay Maddhiboyina |

శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి కొత్తగూడెం నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. ఆనాడు కాంగ్రెస్- సీపీఐ పొత్తులో అ భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు టిక్కెట్ కేటాయించడం భారీ మెజారిటీతో గెలవడం జరిగిపోయింది.

గూడెంపై ఫోకస్ ..కొత్తగూడెనికి పార్టీల అగ్రనేతల రాక
X

కొత్తగూడెం నియోజకవర్గానికి ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకున్నా రాజకీయపార్టీలు మాత్రం ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు వారం రోజుల వ్యవధిలోనే పార్టీల అగ్రనాయకులు చుట్టేశారు. కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) సింగరేణి అంశమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకుపోతున్నారు. ఆయా పార్టీలు ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు పావులు కదుపుతుంటే సందట్లో సడేమియాలా జనసేన పార్టీ ఆగ్రనాయకులు కొత్తగూడెంలో ఎంట్రీ ఇచ్చారు. ఒకరు భరోసా యాత్ర, మరొకరు ఆత్మీయ సమ్మేళనం, ఇంకొకరు బాయిబాటతో కొత్తగూడెం గడ్డపై దండయాత్ర మాదిరిగా పర్యటనలు చేపడుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. - దిశ, కొత్తగూడెం ప్రతినిధి

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి కొత్తగూడెం నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. ఆనాడు కాంగ్రెస్- సీపీఐ పొత్తులో అ భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు టిక్కెట్ కేటాయించడం భారీ మెజారిటీతో గెలవడం జరిగిపోయింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగూడెం నియోజకవర్గం గురించి చర్చ జరిగింది. మళ్లీ రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్తగూడెం ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఎటువంటి ఎన్నికలు లేవు. కానీ రాజకీయపార్టీలు మాత్రం ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు వారం రోజుల వ్యవధిలోనే పార్టీల అగ్రనాయకులు, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, ఎంపీలు, మాజీ మంత్రులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యటించి తమ పార్టీలు చేస్తున్న, చేసిన అభివృద్ధి, సంక్షేమంపై చెబుతూ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు.

సింగరేణి అంశమే ప్రధాన ఎజెండా

కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) సింగరేణి అంశమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకుపోతున్నారు. తొలుత బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కొత్తగూడెంలో సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం' పేరిట సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లేనిబొగ్గును ఉన్నట్లు చూపెడుతున్నట్లు, సంస్థను దివాళ తీసేలా, నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని చెబుతూ తాము సంస్థకు, కార్మికులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చామో వివరించి ఓటు బ్యాంకును పదిలపరుచుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రనాయకులు బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించి తాము సింగరేణి సంస్థ కోసం ఏం చేస్తున్నామో చెప్పారు. ఆ తర్వాత' తెలంగాణ రక్షణ సేన' చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి 'బాయి బాట' కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని బొగ్గుబావులపై పర్యటించి కార్మికుల సమస్యల కోసం తాము చేపడుతున్న చర్యలు, గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేపట్టిన పనులపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడే అడుగులు వేస్తున్న తమ పార్టీకి క్యాడర్ ను సమకూర్చుకునేందుకు ఈ అంశాన్ని వినియోగించుకొని బలోపేతం చేసుకోవాలనుకున్నారు.

రెండురోజుల కిందట కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సైతం సింగరేణి 'భరోసా యాత్ర' పేరుతో పర్యటించి సంస్థను, కార్మికులను కాపాడేందుకే తాడిచర్ల -2 బొగ్గు బ్లాక్ ను టెండర్ సిస్టం లేకుండా నామినేషన్ పద్దతిలో కేటాయించేందుకు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీఎంఎస్ నాయకులు చేసిన కృషిని వివరిస్తూ కార్మిక ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, పార్టీ క్యాడర్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు చేశారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ ను ప్రధాన అస్త్రంగా, సంస్థను కాపాడుకునేందుకు, కార్మికుల సమస్యలే ఎజెండాగా చేసుకొని ఈ నాలుగు పార్టీ నాయకులు కొత్తగూడెం కేంద్రంలో పర్యటించి ప్రత్యర్థులపై ఒకరికొకరు విమర్శలు గుప్పించుకున్నారు.

జనసేన ఎంట్రీ

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు, ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు పావులు కదుపుతుంటే సందట్లో సడేమియాలా జనసేన పార్టీ ఆగ్రనాయకులు కొత్తగూడెంలో ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో తొలిసారి పర్యటించి భారీ ర్యాలీ నిర్వహించి, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పకనే చెప్పాడు. పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించడంతో పాటు గతంలో తాను జీఎస్ఆర్ ట్రస్టు ద్వారా చేసిన సేవలను సమావేశంలో వివరించి తనకు క్యాడర్ ఉందని ఆగ్రనాయకుల ముందు సెలవిచ్చాడు.

మంత్రి వివేక్ ప్రచారం

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలలో పర్యటించి తన సామాజికవర్గ నాయకులతో సమావేశవడం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలను వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను, నాయకులను కొంతమేర ఉత్సాహపరిచే కార్యక్రమాన్ని మంత్రి చేపట్టారు. ఇలా అన్నీ పార్టీల నాయకులు రెండువారాల వ్యవధిలోనే కొత్తగూడెం కేంద్రంగా చేసుకొని పర్యటించి వార్తల్లో ఉండేలా చేశారు.

రంగంలోకి దిగిన కూనంనేని

కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీల నాయకుల ప్రచారాలను, యాత్రలను ఏమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పనిచేసుకుంటూ పోవడమే మన ముందున్న కర్తవ్యంగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇటీవల సమావేశాల పేరిట బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, జనసేన నాయకులు భారీ కటౌట్లు, ర్యాలీలు, ప్రదర్శనల పేరిట హంగూ ఆర్భాటం చేసిన, ఎంతోమంది నాయకులు కొత్తగూడెం పర్యటనకు వచ్చినా ఎమ్మెల్యే వీటిని ఖతారు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు, సీపీఐ కార్యకర్తల శిక్షణ తరగతులను నిర్వహించారు. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం, మరోవైపు పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

విమర్శనస్త్రాలు

కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేవలం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యటిస్తూ ఎన్నికల వాతావరణాన్ని మరిపించేలా ప్రచారాస్త్రాలు, విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. పార్టీల కార్యక్రమాల పేరు భరోసా యాత్ర, ఆత్మీయ సమ్మేళనం, బాయిబాట ఏదైనా కానీ మొత్తానికి ఈ కొత్తగూడెం గడ్డపై ఒకరి తర్వాత ఒకరు యాత్రలు, సమ్మేళనాల పేరిట ఒక మాదిరిగా దండయాత్ర చేసినట్లుగానే ఉందంటూ సగటు ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలు తమ పట్టును నిలుపుకునేందుకు, క్యాడర్ ను పెంచుకునేందుకు అవసరమైన ఆస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునేందుకు ఇది ఒక ట్రయల్ గా ఉపయోగించుకుంటున్నట్లుగా కార్యకర్తలు చెబుతున్నారు.

Next Story