- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండపోచమ్మ సాగర్ విజిలెన్స్ రిపోర్టుపై సస్పెన్స్.. సర్కారుకు చేరని నివేదిక!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక సాగు నీటి ప్రాజెక్టుల్లో ఒకటైన కొండపోచమ్మ సాగర్ విషయంలో విజిలెన్స్ అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో చోటుచేసుకున్న సాంకేతిక, పరిపాలనా అంశాలపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన ఎంక్వయిరీ పూర్తయి దాదాపు 6 నెలలు గడిచినా.. ఆ నివేదిక ఇంకా ప్రభుత్వానికి అధికారికంగా సమర్పించలేదన్న సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. విచారణ బృందం తన నివేదికను ఉన్నతాధికారులకు అప్పగించినప్పటికీ.. ప్రభుత్వ స్థాయికి అది చేరడంలో జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విచారణలో పలు లోపాలు వెలుగుచూసినట్టు తెలిసింది. అంతేకాకుండా కొందరు అధికారులు సైతం బాధ్యులుగా తేలినట్టు సమాచారం. అయినప్పటికీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో వెనుక ఉన్న మతలబేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కావాలనే కొందరు ప్రోద్బలంతో నివేదిక చివరి స్టేజీలో ఆగినట్టు ప్రచారం జరుగుతున్నది.
రూ.1,600 కోట్ల వ్యయంతో నిర్మాణం
రైతన్న సాగునీటి కష్టాలు తీర్చేలా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండపోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో 5 జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కలుగుతుంది. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందిస్తారు. రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 4,700 ఎకరాలను సేకరించగా ములుగు మండలంలోని మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ 8 కిలోమీటర్ల మేర వలయాకారంలో నిర్మించారు. మూడు పాయింట్ల వద్ద నీటిని పంపింగ్ చేసేలా పంప్ హౌజ్‌లను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా 5 జిల్లాల పరిధిలోని గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటన్‌చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని గ్రామాలకు 5 ప్రధాన కాల్వల (135 కిలో మీటర్లు) ద్వారా గోదావరి జలాలను మళ్లించేలా నిర్మించారు. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 15 టీఎంసీలు కాగా.. ఫుల్ రిజర్వాయర్ లెవల్ 618.0 మీటర్లు, కట్ట పొడవు 15.80 కిలో మీటర్లు, కట్ట గరిష్ట ఎత్తు 300 అడుగులు, కట్ట వెడల్పు 100 అడుగులతో నిర్మించారు.
ముందు నుంచీ ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ముందు నుంచీ కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తున్నది. అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సైతం కుంగిపోవడంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించింది. కాగా, కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, బ్యారేజీలు తదితర వాటిపైనా విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 2025 లోనే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. అదే సంవత్సరం చివరలోనే విచారణ పూర్తయింది. ఈ రిజర్వాయర్‌ను మేఘాతో పాటు కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు నిర్మించాయి. వీటితో పాటు కొన్ని కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చాయి. విజిలెన్స్ విచారణలో పలు అక్రమాలు బయటపడినట్టు తెలిసింది. కానీ, ఇప్పటివరకు నివేదిక ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మీద చేపట్టిన విచారణలో భాగంగా బాధ్యులైన అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిపివేసింది. ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్‌లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరిపినప్పటికీ.. విజిలెన్స్ నుంచి రిపోర్టు ప్రభుత్వానికి చేరకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు ఇచ్చినా..
గత ఆగస్టులోనే విజిలెన్స్ టీమ్ కొండపోచమ్మసాగర్‌ను సందర్శించి విచారణ చేపట్టింది. రెండు, మూడు నెలల పాటు కొనసాగిన ఈ విచారణపై రిపోర్టును యూనిట్ విజిలెన్స్ హెడ్ క్వార్టర్స్‌కు పంపించినట్టు ఓ అధికారి వెల్లడించారు. డీజీ స్థాయి వరకు వెళ్లిన నివేదిక ఆ తదుపరి కమిషన్‌కు చేరాల్సి ఉంటుంది. విజిలెన్స్ టీం ఆరు నెలల క్రితమే నివేదికను కార్యాలయానికి పంపించినా ఇంతవరకు కమిషన్ చేతికి చేరలేదన్న ప్రచారం జరుగుతున్నది. డీజీ వరకు చేరిన ఫైల్.. అక్కడే ఆగిపోయిందని సమాచారం. డీజీ నుంచి కమిషన్‌కు వెళ్లిన తరువాత కమిషన్ పూర్తిస్థాయిలో స్టడీ చేసి ప్రభుత్వానికి ఫైల్ సమర్పించాల్సి ఉంటుంది. ఫైల్ ఇంతవరకు కమిషన్ వరకు సైతం చేరలేదని తెలుస్తోంది. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటన్న చర్చ ప్రస్తుతం శాఖలో కొనసాగుతున్నది.
అధికారులకు ప్రమోషన్..
ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో బాధ్యులైన అధికారులకు ప్రమోషన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, కొండపోచమ్మ సాగర్ పరిధిలో కొంతమంది అధికారులు బాధ్యులుగా తేలినప్పటికీ ఆ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఈ అధికారులు మాత్రం రెగ్యులర్‌గా ప్రమోషన్లు తీసుకుంటున్నారని తెలిసింది. మొన్నటికి మొన్న పోయిన నెలలో జరిగిన ప్రమోషన్లలోనూ ఈ అధికారులు ఉన్నారని తెలిసింది. రేపో మాపో జరుగబోతున్న ప్రమోషన్ల జాబితాలోనూ కొందరి పేర్లు ఉన్నాయని సమాచారం. విజిలెన్స్ నివేదికలో నమోదైన అంశాలు వెలుగులోకి వస్తే పలువురు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశమున్నదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అదే కారణంగా నివేదిక ప్రభుత్వ స్థాయికి చేరడంలో ఆలస్యం జరుగుతున్నదన్న ప్రచారం కూడా వినిపిస్తున్నది. కాగా, దీనిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఒకవేళ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక చేరినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.






