- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులైలోనూ ముఖం చాటేయనున్న వానలు
రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా, వరుణుడి కరుణ మాత్రం పూర్తిగా లభించడం లేదు.

- 17 జిల్లాల్లో లోటు వర్షపాతం, 46 మండలాల్లో అత్యంత లోటు వర్షాపాతం
- 16 జిల్లాల్లోనే సాధారణ వర్షాలు
- నేడు, రేపు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా, వరుణుడి కరుణ మాత్రం పూర్తిగా లభించడం లేదు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వర్షపాతం లోటు కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నేటివరకు 265 మండలాల్లో లోటు వర్షపాతం, 46 మండలాల్లో మాత్రం అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. గతనెల 8న నైరుతి రుతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లా నుండి తెలంగాణను తాకాయి. గతంలో కంటే ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు రాష్ర్టంలో ప్రవేశించాయి. అప్పటి నుండి ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుండి సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే ఇటీవల ఎల్ నినో పరిస్థితుల కారణంగా జులై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది.
జిల్లాల వారీగా పరిస్థితి ఇలా..
రాష్ట్రంలోని కేవలం 16 జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు సాధారణ వర్షాపాతం నమోదైంది. మిగిలిన 17 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా, అంటే లోటు వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల సాగు పనులు ప్రారంభించిన రైతులు ఆకాశం వైపు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమరం భీం, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
ఈ నెలలోనూ ఇంతేనా..
నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడంతో, జూన్ నెల తరహాలోనే జులైలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నెలలో సైతం సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలపడంతో వ్యవసాయ రంగానికి ఊరట లభించేలా కనిపించడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యా, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. 222 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షాపాతం నమోదైంది.
నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు..
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.






