- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంపై కేంద్రం శీతకన్ను.. ఎందుకింత వివక్ష?
దక్షిణాదిలో కీలకమైన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉన్నప్పటికీ, నిధుల విడుదలలో మాత్రం కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. రైల్వే బడ్జెట్‌లో ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైల్వే అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం తన శీతకన్ను కొనసాగిస్తోంది. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఆశించిన స్థాయిలో లేకపోవడమే కాకుండా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే సగటున సగం నిధులకే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలో కీలకమైన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉన్నప్పటికీ, నిధుల విడుదలలో మాత్రం కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. రైల్వే బడ్జెట్‌లో ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. ప్రాజెక్టుల విలువ వేల కోట్లలో ఉన్నా, కేటాయింపులు మాత్రం నామమాత్రానికే పరిమితమయ్యాయి. 2025-26 బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే అభివృద్ధికి రూ.5,454 కోట్లు మాత్రమే కేటాయించగా, ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.117 కోట్లు.. అంటే 2.19 శాతం పెంపు మాత్రమే. రాష్ట్రంలో కొనసాగుతున్న దాదాపు రూ.47,984 కోట్ల విలువైన రైల్వే పనులకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ. 886 కోట్లు మాత్రమే అని చెప్తున్న రైల్వే శాఖ మంత్రి.. ఈ ఏడాది తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులను అప్పటితో పోల్చుతూ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని చెప్తోంది. గత ఏడాది బడ్జెట్లో తెలంగాణకు రూ.5337 కేటాయిస్తే... ఈ ఏడాది రూ.5454 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే పెంచింది కేవలం 2.19శాతంతో రూ.117 కోట్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే పెంచింది చాలా తక్కువే.
తెలంగాణపై శీతకన్ను.. ఏపీకి అగ్రతాంబూలం
తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని కేంద్రం.. మరోవైపు పొరుగు రాష్ట్రం ఏపీకి మాత్రం రైల్వే కేటాయింపుల్లో మాత్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో రూ.10,134 కేటాయించారు. గత ఏడాది బడ్జెట్ రూ.9,417కోట్లతో పోలిస్తే ఇది 7.6శాతం అధికం. అలాగే గత ఏడాదికంటే రూ.717 కోట్లు అధికంగా కేటాయింపులు జరిగాయి. మరోవైపు ఏపీలో మాత్రం మొత్తం రూ. 92,649 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతుంటే, తెలంగాణలో కొనసాగుతున్నవి రూ. 47,984 మాత్రమే. కోల్‌కతా- చెన్నై మధ్య 4 లేన్ లైన్లు పూర్తయితే తెలంగాణలో ఇంకా సక్రమంగా డబుల్ లేన్లు కూడా లేవు.
ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తయ్యేది?
2014 నుంచి తెలంగాణలో 753 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి 17 కి.మీ. ట్రాక్ నిర్మాణం మాత్రమే జరిగితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏడాదికి 68 కి.మీ. చేపట్టామని చెబుతోంది. తెలంగాణలో 22 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 39,300 కోట్లతో 2,529 కి.మీ. మేర కొత్త రైల్వే ట్రాక్ పనులు పురోగతిలో ఉన్నాయని, కాజీపేట్ ప్రొడక్షన్ యూనిట్ అప్‌గ్రేడ్‌ను కలుపుకుని రూ.రూ. 47,984 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ తెలంగాణలో ఉందని కేంద్రమంత్రి పేర్కొంటున్నారు. అమృత్ స్టేషన్స్ స్కీం క్రింద రాష్ట్రంలో 40 స్టేషన్లకు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 1,042 కోట్లను మంజూరు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అయితే రాష్ట్రంలో రూ. 47,984 కోట్ల పనులకు గాను బడ్జెట్లో కేవలం రూ.5454 కోట్లు కేటాయించడం చూస్తే తెలంగాణ రైల్వే ప్రగతిపై కేంద్రానికి ఏ మేర శ్రద్ధ ఉందో అర్థమవుతుందని రైల్వే రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ రైల్వే సేవలపైనే శ్రద్ధ చూపలేదంటే.. తెలంగాణకు నిధులు కేటాయిస్తుందని భావించడం అత్యాశే అవుతుందని చెబుతున్నారు.
రైల్వే బడ్జెట్ ఆశాజనకం : సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదికి రూ. 5,454 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాం. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే నగరాలకు ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడేలా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను అభివృద్ధి చేయబోతున్నాం. గత పదేళ్లలోకంటే ఈసారి తెలంగాణకు రెట్టింపు స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయించారు.






