- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద విద్యార్థులపై కొత్త భారం.. కేటగిరీల ఏకీకరణ పేరుతో ఫీజుల దందా
రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మంగళం పాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మంగళం పాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన కోర్టు తీర్పును ఆయా కాలేజీలు తమకు అనుకూలంగా మలుచుకొని.. ‘ఏ’ కేటగిరి (కన్వీనర్), ‘బీ’ కేటగిరి (మేనేజ్ మెంట్) సీట్లను ఇకపై ఒకటే కేటగిరీగా మార్చి పేద విద్యార్థులపై ఆర్థికభారం మోపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. దీనిపై విద్యార్థుల తల్లితండ్రులు, వైద్య విద్యార్థులు, వైద్యసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కోర్టు తీర్పును వక్రీకరించి..!
ఒక కాలేజీలో ఒక కోర్సుకు ఒకే ఫీజు ఉండాలని, అది ఆయా కళాశాలల ఖర్చుల ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో అభిప్రాయపడింది. కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా అంటూ వేర్వేరు ఫీజులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాలేజీకి వచ్చే వాస్తవ ఖర్చుల ఆధారంగా స్వతంత్ర ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయితే ఏ, బీ కేటగిరీ సీట్లకు ఒకే ఫీజు అమలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గందరగోళానికి దారితీసింది. కన్వీనర్ కోటాలో ఏడాదికి రూ. 60 వేలు మాత్రమే ఫీజు ఉండడంతో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశముండేది. ఇప్పుడు కోర్టు తీర్పు సాకుతో అందరికీ ఒకే ఫీజు పేరు చెప్పి ఫీజును రూ. 9-15 లక్షల వరకు పెంచే కుట్ర జరుగుతున్నదని మెడికో పేరెంట్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఆరోపించాయి. పేద విద్యార్థులను అధిక ఫీజుల నుంచి కాపాడడమే కోర్టు తీర్పు అసలు ఉద్దేశ్యమని పేర్కొన్నాయి.
వివాదాస్పదంగా టీఏఎఫ్ఆర్సీ లేఖ
కోర్టు తీర్పును అమలు చేయాలంటూ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రభుత్వానికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఏ, బీ కేటగిరీలకు ఒకే ఫీజు అమలు చేయాలని కోరుతూ పంపిన ఈ లేఖ, విద్యార్థుల హితానికి కాకుండా ప్రైవేటు కాలేజీల ఫీజు పెంపునకు లీగల్ కవర్ ఇచ్చేలా ఉన్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫీజుల పెంపు లేకుండా చూడాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ (పీఏఎంఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూకు వినతి పత్రం అందించారు. ఈ అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థులు, తల్లితండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రశ్నించని పార్టీలు
వైద్య విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయంపై పోరాటాలు చేయాల్సిన విపక్షాలు కనీసం నోరు మెదపడం లేదు. రాష్ట్రంలోని కీలకమైన ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నీ అధికార, విపక్ష పార్టీలకు చెందినవే కావడంతో ఎవరూ దీనిపై స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే దీనిపై ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల నేతలు పల్లెత్తు మాట అనడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రైవేటు మెడికల్ కాలేజీలు రాజకీయ నాయకులు, కార్పొరేట్ వర్గాల ఆధీనంలో ఉన్నాయన్న విమర్శల మధ్య, ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి. పేద విద్యార్థులకు అన్యాయం చూడాలని, అవసరమైతే అప్పీల్‌కు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి.
పేదలకు వైద్యవిద్య దూరమయ్యే ప్రమాదం
ప్రభుత్వ కాలేజీలో అవకాశం కోల్పోయిన నిరుపేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో వైద్య విద్య పూర్తిచేసుకునే మార్గం కన్వీనర్ కోటా. ఇప్పుడు ఆ కోటాను మేనేజ్‌మెంట్ సీట్లతో సమానంగా చేయాలన్న కుట్ర జరుగుతున్నదని హెచ్ఆర్డీఏ ఆరోపిస్తున్నది. సామాజిక న్యాయాన్ని పక్కనబెట్టి లాభాల కోసమే ఈ ఒత్తిళ్లు వస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అప్పీల్ అవకాశాలను పరిశీలించాలని కోరుతున్నది. ప్రభుత్వం స్పందించకపోతే వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షగా మారే ప్రమాదమున్నది. కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణీత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరింత పెంపు జరిగితే, సామాన్య కుటుంబాల పిల్లలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ నేతలు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి
-మల్లోజు సత్యనారాయణ చారి, రాష్ట్ర అధ్యక్షుడు, మెడికో పేరెంట్స్ అసోసియేషన్
రాష్ట్రంలోని అధికశాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు రాజకీయ నాయకులు, కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. అయితే ఈ వైద్యకళాశాలలన్నీ ఒక కూటమిగా ఏర్పడి కన్వీనర్ కోటా సీట్లకు సైతం భారీగా ఫీజులు వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. కోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలచుకుంటూ.. ఏ, బీ కేటగిరీలు లేకుండా ఒకటే కేటగిరీ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రూ. 60 వేలు ఉన్న ఫీజును.. రూ. 15 లక్షల వరకు పెంచాలనే కుట్ర జరుగుతున్నది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఏ కేటగిరీ 50 శాతం సీట్లు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. దానికి తగ్గట్లుగానే ఫీజులు ఉండాలి. ఇప్పటికే నిర్ణీత ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. చట్టబద్ధంగా ఫీజులు పెంచాలనుకోవడం సరికాదు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి.






