TG: అన్ని రాష్ట్రాలు ఇలానే చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?

by Gantepaka Srikanth |

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రెండు సొరంగాలను 20,000 క్యూసెక్కుల నుండి 40,000 క్యూసెక్కులకు, కుడి ప్రధాన కాలువ (ఆర్‌ఎంసీ)ను 10,000 క్యూసెక్కుల నుండి 17,548 క్యూసెక్కులకు విస్తరించిందని.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

TG: అన్ని రాష్ట్రాలు ఇలానే చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రెండు సొరంగాలను 20,000 క్యూసెక్కుల నుండి 40,000 క్యూసెక్కులకు, కుడి ప్రధాన కాలువ (ఆర్‌ఎంసీ)ను 10,000 క్యూసెక్కుల నుండి 17,548 క్యూసెక్కులకు విస్తరించిందని.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) 17వ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్, కేజీబీవో కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అతుల్ జైన్ అధ్యక్షత వహించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జలశక్తి మంత్రిత్వ శాఖ (ఎంఓజేఎస్) తదితర విభాగాల అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. రాష్ట్రం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జతోపాటు తదితర అధికారులు పాల్గొన్నారు. ఏపీ నుండి భూసేకరణ (ఎల్‌ఏ), పునరావాస (ఆర్‌ఆర్‌) కమిషనర్ పురోగతిని వివరించారు.

విస్తరణలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

ముందుగా.. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ మాట్లాడుతూ సొరంగం, కాలువల విస్తరణ పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రం ఇలా చేస్తే, పరిణామాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు కూడా ఇలాగే చేస్తే దిగువకు నీరు వస్తుందా అని ప్రశ్నించారు. ఈ తరహా చర్యలను తాము వివిధ వేదికల్లో వ్యతిరేకిస్తున్నామని, అధికారులకు అనేక లేఖలు రాస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై పీపీఏ మెంబర్ సెక్రటరీ గతంలో అనేక లేఖలు రాశారని, సమావేశాల మినిట్స్‌లో నమోదు చేశారని చెప్పారు. విస్తరణలను, నిర్మాణాన్ని ఆపలేకపోయిందని ఆరోపించారు. ఇటువంటి కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలతోపాటు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

పీపీఏ కార్యాలయం తరలింపునకు అంగీకారం

పీపీఏ కార్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు ఈ సమావేశంలో అంగీకరించారు. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి తరలించే అంశంపై 16వ పీపీఏ సమావేశంలోనే అంగీకరించగా.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ధ్రువీకరించారు. అలాగే.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన పర్యావరణ అనుమతులపై స్టే ఆర్డర్ పొడిగించిన నేపథ్యంలో ఎఫ్ఆర్‌ఎల్ స్థాయి 45.72 మీటర్ల వరకు భూసేకరణ, పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న జాయింట్ సర్వే స్థితిపై చర్చించారు. అయితే.. ఫేజ్-I (41.15 మీ) కింద ముంపునకు గురికాని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జాయింట్ సర్వే పూర్తయినప్పటికీ, తమ రాష్ట్రంలో ఎందుకు అలాంటి సర్వే ప్రతిపాదించబడలేదని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.

భద్రాచలం, డ్రైనేజీ సమస్యలు..

భద్రాచలం, డ్రైనేజీ సమస్యలపై సుప్రీంకోర్టు 2022 సెప్టెంబర్ నెలలో పలు ఆదేశాలు జారీ చేసిందని.. తెలంగాణ రాష్ట్రంలో రక్షణ పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, డ్రైనేజీ రద్దీ అధ్యయనం కోసం 6 పెద్ద వాగుల సర్వే ఇంకా జరగాల్సి ఉందని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఈ సర్వే తర్వాత 8 వాగుల (6 పెద్ద వాగులు + కిన్నెరసాని, ముర్రేడువాగు) సరిహద్దు నిర్ణయ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫేజ్-I (41.15 మీటర్ల) నిల్వ వరకు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే, భద్రాచలం పట్టణం గుండా నీరు వెళ్లే ఏటపాక అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ (సిల్ లెవల్ 40.250) మునిగిపోతుందని, దీనివల్ల గోదావరి నదిలోకి నిరంతరం పంపింగ్ అవసరమవుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సీఈఓ అతుల్ జైన్, ఈ అవుట్‌ఫాల్ రెగ్యులేటర్‌లను సందర్శించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ, ఏపీ అధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ అంగీకరించారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్ 90(4) ప్రకారం ప్రాజెక్టు అనుమతులు పొందడానికి పీపీఏ మాత్రమే అధీకృత సంస్థ అని నొక్కి చెప్పారు.

నిలిచిపోయిన బనకచర్ల

పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ లేవనెత్తింది. పీబీఎల్‌పీకి మూలం పోలవరం ప్రాజెక్ట్ అని, అయితే.. ఈ ప్రాజెక్ట్ పరిధి కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. తెలంగాణ అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా పోలవరం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుండి 23 టీఎంసీల నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం (ఎల్‌ఐఎస్) అని ఏపీ అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం దాని నిర్మాణ పనులు నిలిపివేయబడ్డాయని ధ్రువీకరించారు.

Next Story