జనగణనలో భారీ సంఖ్యలు.. 4 కోట్లు దాటిన తెలంగాణ జనాభా?

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో జనాభా నాలుగు కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనగణన హౌస్‌ లిస్టింగ్​సర్వే నడుస్తుండగా.. జూన్ ​9వ తేదీతో సర్వే పూర్తికానుంది.

జనగణనలో భారీ సంఖ్యలు.. 4 కోట్లు దాటిన తెలంగాణ జనాభా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జనాభా నాలుగు కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనగణన హౌస్‌ లిస్టింగ్​సర్వే నడుస్తుండగా.. జూన్ ​9వ తేదీతో సర్వే పూర్తికానుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపుగా కోటి ఇళ్లల్లో జనగణన అధికారులు హౌస్​‌లిస్టింగ్​సర్వే పూర్తిచేశారు. ఇందులో దాదాపుగా 3.86 కోట్ల జనాభా ఉందని లెక్కలు వేశారు. మరో 20 లక్షల ఇండ్లల్లో జనగణన సర్వే చేసి వివరాలు సేకరించాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. నాలుగు వారాల సర్వేలో భాగంగా వారానికి దాదాపుగా 30 లక్షల ఇళ్ల చొప్పున యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. మొదట్లో మ్యాపింగ్, ఆ ప్రాంతంపై అవగాహన, యాప్‌లో సాంకేతిక సమస్యల కారణంగా మొదటి మూడు, నాలుగు రోజులు సర్వే కొద్దిగా నెమ్మదిగా సాగింది. ఆ తర్వాత వేగం పుంజుకుంది. జూన్​ 9తో సర్వేను పూర్తి చేయాల్సి ఉంది.

జనగణన, ఓటరు మ్యాపింగ్ ఒకేసారి..

గ్రామీణ ప్రాంతాల్లో హౌస్​‌లిస్టింగ్ సర్వేలో ఎలాంటి సమస్య లేకపోయినా పట్టణ ప్రాంతాల్లోనే సమస్యలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున అనేక మంది తీర్థయాత్రలు, విహారయాత్రలు, వ్యక్తి గత పనులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినట్టు గుర్తించారు. అనేక ఇళ్లకు తాళాలు వేసి ఉన్నందున ఇబ్బందులు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఒకే ఇంటికి రెండు, మూడు సార్లు వెళ్లాల్సి వస్తుందని, ఇంట్లో ఎవరూ ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సంఖ్యలోనే ఇళ్లు ఉన్నాయని.. కొత్త కాలనీలు, గేటెడ్​ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున రావడంతో సిబ్బందిపై అదనపు భారం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక మంది వడదెబ్బతో చనిపోతున్నారు. సర్వే చేసే సిబ్బంది సైతం ఎండలో తిరగలేక ఉదయం, సాయంత్రం వేళల్లో తమ పనిని ముగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టణాల్లో విద్యావంతులు ఉన్నా సిబ్బందికి సరిగా సహకరించడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. సహాయనిరాకరణ చేయడం, అనేక యక్ష ప్రశ్నలు వేసి సిబ్బందిని విసిగిస్తున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఓటరు జాబితా ప్రక్షాళన మ్యాపింగ్​సైతం చేస్తున్నారు. కొన్నిచోట్ల జనగణన, మరోవైపు ఓటరు మ్యాపింగ్ ఒకేసారి జరుగుతుండటంతో ఎవరు ఏ అధికారి అని తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. ఓటరు మ్యాపింగ్​అధికారులు వారికి సంబంధించిన వ్యక్తుల వివరాలు, ధ్రువపత్రాలు కూడా అడుగుతుండటంతో కొంత గందరగోళానికి గురవుతున్నారు. పూర్తి అవగాహన లేకపోవడంతో వల్ల కొంత ఆందోళనకు కూడా గురైనట్టు సమాచారం.

సర్వేల్లో తేడాలు..

గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ గణన చేసినప్పుడు 1.15 కోట్ల కుటుంబాలను గుర్తించారు. నాడు మొత్తం జనాభా 3.50 కోట్లుగా తేలింది. కానీ, కొందరు సర్వేలో పాల్గొనలేదు. ప్రస్తుత జనగణనలో మాత్రం అంత కంటే తక్కువ సంఖ్యలోనే ఇళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బీసీ గణనలో ప్రభుత్వ పథకాల కోసం కలిసి ఉన్న కుటుంబాలు సైతం విడివిడిగా వివరాలు నమోదు చేసుకున్నాయి. జనగణనకు వచ్చే సరికి మాత్రం అందరూ తక్కువ కుటుంబాలను చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబాల సంఖ్య తక్కువగా, జనాభా సంఖ్య ఎక్కువగా ఉంటోందని క్షేత్రస్థాయి జనగణన అధికారులు చెబుతున్నారు. 1.15 కోట్లకు కొంచెం అటు ఇటుగా కుటుంబాలు ఉంటాయని, జనాభా మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా కోటి వరకు ఇళ్ల సర్వే పూర్తయిందని, హైదరాబాద్​మహానగరంలో మాత్రం ఇళ్ల సంఖ్య పెరిగే చాన్స్ ఉందని, గేటెడ్​కమ్యూనిటీలోనూ కొందరు బీసీ గణనకు సహకరించలేదని.. కానీ, ప్రస్తుతం జనగణనకు ప్రజలంతా సహకరిస్తున్నందున ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

Next Story