- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. గ్రామీణ తెలంగాణకు ఊరట
డీలిమిటేషన్ తో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు భారీగా పెరగనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : డీలిమిటేషన్ ప్రక్రియతో రాష్ట్రంలో భారీగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల సంఖ్య పెంపు, మహిళలకు చట్టసభల్లో మూడో వంతు సీట్ల రిజర్వేషన్‌లతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అదే సమయంలో సీట్ల రిజర్వేషన్‌లు, భౌగోళిక సరిహద్దుల్లో మార్పులు జరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్‌లు, మహిళా సీట్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. ఒక్కో లోక్‌సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాల చొప్పున శాసనసభ స్థానాలు 182కి చేరనున్నాయి. వీటిలో మహిళలకు 60 సీట్లు రిజర్వ్ కానున్నాయి. రాష్ట్రంలో 3,50,40,000 జనాభా ఉందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మొత్తం 182 సీట్లలో ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 10 శాతం ఎక్కువ లేదా 10 శాతం తక్కువ కానీ జనాభా ఉండేలా నియోజకవర్గాలను రూపొందించవచ్చు. ఈ నిబంధనను పునర్విభజన కమిషన్‌లో పొందుపర్చనున్నారు. గతంలోనూ ఈ రూల్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజనను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రిజర్వేషన్ల వారీగా సీట్లు..
రాష్ట్రంలో పెరిగే అసెంబ్లీ స్థానాలతో కలుపుకుని ఎస్సీలకు 28 సీట్లు, ఎస్టీలకు 16 అసెంబ్లీ సీట్లు రిజర్వ్కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉండగా ఇందులో పురుషులు 1.76 కోట్లు, మహిళలు 1.73 కోట్లు ఉన్నారు. తెలంగాణలో ఎస్సీల జనాభా 54.09 లక్షలుగా ఉంది. దీంతో ఎస్సీలకు 15.45 శాతం సీట్లు రిజర్వ్చేయాల్సి ఉంటుంది. ఎస్టీల జనాభా 31.78 లక్షలుగా ఉండటంతో వారికి 9.08 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా పరిగణిస్తారు.ఈ లెక్కల ప్రకారం ఎస్సీలకు 28 సీట్లు, ఇందులో 9 సీట్లు ఎస్సీ మహిళలకు దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు ఎస్టీలకు 16 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్కానున్నాయి. 138 సీట్లు జనరల్ కేటగిరిలో ఉండనున్నాయి. ఇందులో మహిళలకు 46 సీట్లు రిజర్వ్కానున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా వీటిని 26కు పెరగనున్నాయి. ఇందులో 8 స్థానాలు మహిళలకు రిజర్వ్కానున్నాయి. ఇప్పటికే ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 లోక్‌సభ స్థానాలు రిజర్వ్కాగా వీరికి మరోకటి లేదా 2 సీట్లు వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇందులో మహిళా రిజర్వేషన్లు సైతం అమలు చేయనున్నారు.
107 నుంచి 182 వరకు..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 107 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. 2008లో జరిగిన పునర్విభజనలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119కి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పునర్విభజన చట్టంలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచనున్నట్లుగా చట్టంలో పొందుపర్చారు. అయితే, పునర్విభజన చట్టాన్ని అమలు చేయలేదు. దీంతో 119 సీట్లే కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 182 వరకు పెరగనున్నాయి.
కమిటీలో ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు
డీలిమిటేషన్కమిటీకి సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, రాష్ట్రంలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రతినిధి, సెన్సెస్అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా, ఇతర అధికారులు కమిటీలో ఉంటారు. వీరితో పాటుగా 10 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు ఉంటారు. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు శాసనసభ్యులు అసోసియేట్సభ్యులుగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులను లోక్‌సభ స్పీకర్ఎంపిక చేస్తారు. ఐదుగురు ఎమ్మెల్యేలను శాసనసభ స్పీకర్ ఎంపిక చేస్తారు. ఈ 10 మంది డీలిమిటేషన్కమిటీ సమావేశాలకు హాజరై వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలుపొచ్చు.
ప్రస్తావనకు రాని పెద్దల సభ
కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులో శాసనమండలి, రాజ్యసభలో సీట్ల పెంపు ప్రస్తావనను తీసుకురాలేదు. శాసనసభలో ఉండే సీట్ల సంఖ్యలో మూడో వంతు మండలిలో ఉంటాయి. ప్రస్తుతం మండలిలో 40 సీట్లు ఉండగా.. అవి 60కి పెరగాల్సి ఉన్నది. కేంద్రం మాత్రం ప్రస్తుత బిల్లుల్లో మండలి ప్రస్తావన తీసుకరాలేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు, నిపుణులు డీలిమిటేషన్ అమలయ్యాక కేంద్రం మరొక బిల్లులో రాజ్యసభ, మండలికి సంబంధించిన సీట్ల పెంపుపై ప్రత్యేక బిల్లులు తీసుకువస్తారని, అప్పుడు వాటి సీట్లు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో పెరగనున్న సీట్లు..
డీలిమిటేషన్‌లో భాగంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా పట్టణాలకు వలసలు పెరిగాయి. అవి జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర రాజధానికి పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పెరిగే సీట్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉండనున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయని ఒక అంచనాకు వచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్జిల్లాలో ప్రస్తుతం 25 సీట్లు ఉన్నాయి. వీటిలో అదనంగా మరో 15 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటుగా సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం, పటాన్ చెరు, సంగారెడ్డి, సదాశివుపేట తదితర ప్రాంతాలతో మరో నాలుగైదు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 45 నుంచి 50 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది.
ఊపిరి పీల్చుకున్న గ్రామీణ తెలంగాణ..
2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించడంతో గ్రామీణ తెలంగాణ ఊపిరి పీల్చుకుందనే చెప్పవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 2011 తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు భారీగా వలసలు పెరిగాయి. 2011కు ముందు వలసలు ఉన్నా.. తక్కువగా ఉన్నాయని, ఆ తరువాత రాను రాను ప్రతిఏటా పట్టణీకరణ పెరిగింది. ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాలకు ఎక్కువగా వలసలు వచ్చాయి. గత 15 ఏండ్లలో హైదరాబాద్ నగరంలో జనాభా పెరిగింది. దీంతో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, రాజేంద్రనగర్, పటాన్చెరు, మహేశ్వరం, ఉప్పల్ లాంటి నియోజకవర్గాల్లో విపరీతమైన వలసలు పెరిగాయి. దీంతో ఆయా నియోజకవర్గాలతో ఒక్కొక్కటికి మూడు, నాలుగు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉండేదని, కానీ, 2011 జనాభా లెక్కలను తీసుకోవడంతో కొంత తక్కువగానే సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.






