దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసింగ్‌.. డీజీపీకి ఘనంగా వీడ్కోలు

by Ramesh Naini |

మాదకద్రవ్యాలు, అవినీతి పైనే కాకుండా.. అదృశ్యంగా పొంచి ఉండే సైబర్‌ నేరాల పైనా తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం దేశంలోనే సైబర్‌ క్రైమ్‌ పోలీసింగ్‌లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్‌బీ తన ప్రగతి నివేదికను ఆవిష్కరించింది.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసింగ్‌.. డీజీపీకి ఘనంగా వీడ్కోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాదకద్రవ్యాలు, అవినీతి పైనే కాకుండా.. అదృశ్యంగా పొంచి ఉండే సైబర్‌ నేరాల పైనా తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం దేశంలోనే సైబర్‌ క్రైమ్‌ పోలీసింగ్‌లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్‌బీ తన ప్రగతి నివేదికను ఆవిష్కరించింది. ట్రాన్స్‌ఫార్మింగ్ సైబర్ క్రైమ్ పోలీసింగ్ ఇన్ ఇండియా 2024- 2025 పేరుతో రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరగాళ్ల ఎత్తుగడలకు పై ఎత్తులు వేయడంలో మన బ్యూరో దేశానికే దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. గడిచిన రెండేళ్లలో సైబర్‌ నేరాల నిరోధం, దర్యాప్తు ప్రజల్లో అవగాహన కల్పించడంలో టీజీసీఎస్‌బీ సాధించిన విజయాలు కేవలం కేసుల నమోదుకే పరిమితం కాకుండా, బాధితులకు తక్షణ ఆర్థిక ఊరటనివ్వడం, అంతర్రాష్ట్ర నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించడంలో తెలంగాణ పోలీసులు చూపిన చొరవను నివేదిక హైలైట్ చేసింది. డీజీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ పర్యవేక్షణలో బ్యూరో సాధించిన పురోగతిపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన పౌర కేంద్రిత పోలీసింగ్‌కు ఇది నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు.

పదవీ విరమణ వేళ డీజీపీకి ఘనంగా వీడ్కోలు..

అనంతరం పదవీ విరమణ పొందనున్న డీజీపీ బి. శివధర్ రెడ్డికి టీజీసీఎస్‌బీ అధికారులు ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ పోలీస్‌ విభాగాన్ని ఆధునీకరించడంలో, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఆయన పోషించిన పాత్రను అధికారులు గుర్తు చేసుకున్నారు. శివధర్ రెడ్డి నాయకత్వం పోలీస్ శాఖకు ఒక బలమైన పునాదిని ఇచ్చింది. ముఖ్యంగా సైబర్‌ భద్రతపై ఆయనకు ఉన్న స్పష్టమైన విజన్‌ వల్ల నేడు తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది అని శిఖా గోయల్ ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించి బ్యూరో తరపున కృతజ్ఞతలు తెలిపారు. తన సుదీర్ఘ సర్వీసులో అందించిన సహకారానికి, తనపై చూపిన అభిమానానికి డీజీపీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో సైబర్‌ రక్షణ కవచంలా తెలంగాణ పోలీస్‌ విభాగం నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఏ.ఆర్. శ్రీనివాస్, సైబర్ క్రైమ్స్ ఎస్పీ బి. సాయి శ్రీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story