లాటరీ వలలో చిక్కొద్దు.. మెసేజ్‌, మెయిల్స్‌కు స్పందించొద్దు: తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి.

లాటరీ వలలో చిక్కొద్దు.. మెసేజ్‌, మెయిల్స్‌కు స్పందించొద్దు: తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు (cybercrimes) సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్దతుల్లో కేటుగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. కొందరి అత్యాశను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకోని ఖాతాలను దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీస్‌ శాఖ (Telangana Police) తన అధికారిక ఖాతా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. (lottery) లాటరీ వలలో చిక్కొద్దని, లాటరీ తగిలిందంటూ వచ్చే మెసేజ్‌లతో భద్రం అని పేర్కొంది. ఉచితంగా డబ్బులు వస్తాయని ఆశపడొద్దని సూచించింది. ఈజీగా వచ్చే డబ్బు కోసం ఆశపడితే ఖచ్చితంగా మోసపోవడం ఖాయమని హెచ్చరించింది. మెయిల్స్, మెసేజ్‌ల్లో వచ్చే లింక్స్ క్లిక్ చేయొద్దని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాశకు వెళ్లొద్దు.. కాస్త ఆశ పడ్డారంటే పూర్తిగా ముంచేస్తారని తెలిపింది. లాటరీ ప్రాసెసింగ్ ఫీజు పేరిట ఖాతా ఖాళీ చేస్తారని హెచ్చరించారు.

కాగా, సైబర్ నేరాలు అధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి జరుగుతున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు తొలి ఐదు నెలలొనే భారతీయులకు ఆన్‌లైన్ మోసాల ద్వారా దాదాపు రూ.7 వేల కోట్లు నష్టం వాటిల్లిందని, వాటిలో సగానికి పైగా నేరాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుంచి పనిచేస్తున్న సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లే కారణమని హోంశాఖ ప్రకటించింది. సైబర్ మోసాల వల్ల భారత్ ప్రతి నెలా దాదాపు రూ. వెయ్యి కోట్లు నష్టపోతోందని ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల నివేదికలో వెల్లడించింది.

Next Story