- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల ఏరివేత.. ఆక్టోపస్ దళాల సన్నద్ధతపై డీజీపీ సమీక్ష
రాష్ట్రంలోని రక్షణ దళాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ల పనితీరు, కార్యచరణ పటిమపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు.

- గ్రేహౌండ్స్‌లో 708 పోస్టుల సరెండర్‌కు ప్రతిపాదన
- 24 గంటలూ విధులకు సిద్ధంగా ఉండాలి.. డీజీపీ సీవీ ఆనంద్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రక్షణ దళాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ల పనితీరు, కార్యచరణ పటిమపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. మావోయిస్టుల ఏరివేతలో దేశంలోనే మేటి దళంగా పేరుగాంచిన గ్రేహౌండ్స్‌లో పోస్టుల తగ్గింపుతో పాటు, ఉగ్రవాద వ్యతిరేక దళం ఆక్టోపస్ ను ఆధునీకరించే అంశాలపై ఆయన మారుతున్న భద్రతా అవసరాలకు అనుగుణంగా శిక్షణలో నిరంతరం మార్పులు ఉండాలని, ఎలైట్ దళాలు ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయి పోరాట పటిమను చాటాలని ఆయన స్పష్టం చేశారు.
708 గ్రేహౌండ్స్ పోస్టుల సరెండర్
రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలాన్ని కొంతమేర తగ్గించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్‌కు చెందిన 708 పోస్టులను సరెండర్ చేసే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని, ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉందని డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే ఆయా సిబ్బందిని తిరిగి మాతృ విభాగాలకు పంపే ప్రక్రియ చేపడతామన్నారు. అంతకుముందు గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. సిబ్బందికి క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించాలని, నిరంతరం శిక్షణను ఆధునీకరించాలని ఆదేశించారు. గ్రేహౌండ్స్ అంకితభావం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఆ పేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీజీపీ కొనియాడారు.
ఎయిర్‌పోర్టుల భద్రతపై ఆక్టోపస్ నజర్
అనంతరం ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డీజీపీ అక్కడ కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి, కమాండోలతో ముఖాముఖి మాట్లాడారు. ఉగ్రవాద దాడులు ఎదురైతే వాటిని తిప్పికొట్టేలా స్వాట్ బృందాల సన్నద్ధతపై ఆరా తీశారు. భవిష్యత్తులో నగరానికి రాబోయే కొత్త విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా వివిధ భవన సముదాయాల్లో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం అత్యంత కీలకమని డీజీపీ స్పష్టం చేశారు.
24 గంటలూ నిఘా
కమాండోలు శారీరక దృఢత్వంలో ప్రమాణాలు పాటించాలని, 24 గంటలూ విధులకు సిద్ధంగా ఉండాలని డీజీపీ సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అత్యాధునిక పరికరాల సేకరణకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సమీక్షా సమావేశాల్లో డీజీ ఆపరేషన్స్ డాక్టర్ అనిల్ కుమార్, ఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, గ్రూప్ కమాండర్ రాఘవేందర్ రెడ్డి, అదనపు ఎస్పీ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.






