- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారుల సమస్యల పరిష్కారానికి బాల పంచాయతీలు : ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా
గ్రామాల్లో మహిళలు, చిన్నారుల భద్రతను మెరుగుపరచడంతో పాటు, స్థానిక పాలనలో పిల్లలను భాగస్వాములను చేస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసు శాఖ నయా ప్రయోగం..
- చిన్నారుల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి, మహిళల భద్రతకు పెద్దపీట
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామాల్లో మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు స్థానిక పాలనా వ్యవహారాల్లో బాలలను సైతం భాగస్వాములను చేస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఓ అద్భుతమైన, వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా.. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం గ్రామాల్లో బాల పంచాయతీ ల ఏర్పాటుకు నడుంబిగించింది. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ డీజీ చారు సిన్హా అధికారికంగా ఆవిష్కరించి, లాంఛనంగా ప్రారంభించారు. యంగిస్థాన్ ఫౌండేషన్, మై ఛాయిసెస్ ఫౌండేషన్ సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్ ల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేలా.. బాల పంచాయతీ అనేది గ్రామస్థాయిలో పిల్లలు ఒకచోట చేరి, వారి జీవితాలపై ప్రభావం చూపే స్థానిక సమస్యలను స్వేచ్ఛగా చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక వేదిక. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడంలో పిల్లలను ముందువరసలో నిలపడం, వారిలో ఆత్మవిశ్వాసం, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఏవైనా సమస్యలకు పరిష్కారాలు చూపే క్రమంలో, పెద్దలు తీసుకునే నిర్ణయాల్లో ఇకపై పిల్లల సూచనలకు సైతం తగిన గుర్తింపు దక్కేలా ఈ బాల పంచాయతీలు పని చేయనున్నాయి.
తొలివిడతగా నాలుగు జిల్లాల్లో.. ఈ విధానాన్ని ముందుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 2వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ బాల పంచాయతీల కొనసాగుతాయి. వరంగల్ జిల్లాలోని తీగరాజుపల్లి, ఉప్పర్‌పల్లి.. మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడ.. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్, మదనపల్లి.. మెదక్ జిల్లాలోని సిక్లండాపూర్ గ్రామాలను ఈ పైలట్ ప్రాజెక్టు కోసం అధికారులు ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో బాల పంచాయతీల సభ్యులు క్రమం తప్పకుండా సమావేశమై, గ్రామ సమస్యలను గుర్తించి, సమిష్టిగా పరిష్కారాల దిశగా అడుగులు వేస్తారు. పారదర్శకంగా సభ్యుల ఎంపిక బాల పంచాయతీల సభ్యులను అత్యంత పారదర్శకంగా, కలుపుగోలు విధానంలో ఎంపిక చేయనున్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ సాగుతుంది. బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు అన్ని వర్గాలు, నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ప్రతి చిన్నారి సంతోషంగా, సురక్షితంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, పిల్లల గళాన్ని వింటూ వారిని సాధికారత దిశగా నడిపించడం ద్వారా భవిష్యత్తులో మరింత సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు.






