నేర పరిశోధనలో తెలంగాణ పోలీస్ భేష్

by Muthe.Rajitha |

దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్ శాఖగా రాష్ట్ర సర్కార్ పోలీస్ శాఖ ఆవిర్భవించిందని, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు.

నేర పరిశోధనలో తెలంగాణ పోలీస్ భేష్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్ శాఖ ఆవిర్భవించిందని, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. సిఐడీ విభాగంలో ఉత్తమ పనితీరును ప్రదర్శించిన 52 మంది పోలీసు సిబ్బందికి డీజీపీ బుధవారం రివార్డులను అందించారు. అధికారులను ప్రశంసాపత్రం, నగదు రివార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. సెల్ ఫోన్ రికవరీలో దేశంలోనే ఈ విభాగం ముందుందని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది అసాధారణ పనితీరు డిపార్ట్‌మెంట్ విజయానికి గణనీయంగా దోహదపడిందని అన్నారు. ఇదే ప్రతిభను కొనసాగించి మరింతగా తెలంగాణ పోలీస్ ప్రతిష్ట పెంచాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా సిఐడి డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ మాట్లాడుతూ సిఐడి, ఇతర విభాగాలలో 52 మంది అధికారులు అత్యంత ప్రతిభ కనబరచారని వారికి రివార్డులు అందజేస్తూ.. అభినందనలు తెలిపారు. బెస్ట్ గ్రేవ్ క్రైమ్ డిటెక్షన్ , బెస్ట్ కన్విక్షన్ ,గరిష్ట సంఖ్యలో యూఐ కేసుల లిక్విడేషన్ , నాన్ బెయిలబుల్ వారెంట్లు చేయడం , పోక్సో కేసులను నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించడం, జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించడం, సైబర్ క్రైమ్ కేసులలో అత్యుత్తమ రిఫండింగ్ , ఆస్తి నేరాలను గుర్తించడంలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీస్ దేశంలో ప్రధమంగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డిజీ బి. శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ మహేష్ ఎం. భగవత్ , ఐజీ అనిల్ కుమార్, ఎం. రమేష్, చంద్రశేఖర్ రెడ్డి. రమేష్ నాయుడు, శ్రీ శ్రీనివాస్, సిఐడి డిఐజి నారాయణ నాయక్, సిఐడి ఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు ‌.

Next Story