- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ.. రికార్డు స్థాయిలో పర్యాటకుల రాక: పర్యాటక శాఖ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించిందని పర్యాటక శాఖ వివరాలను వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించిందని పర్యాటక శాఖ వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 ను అమలు చేశారు. ఈ విధానం ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర పర్యాటకం, డిజిటల్ ప్రచారం, అంతర్జాతీయ బ్రాండింగ్, నైపుణ్యాభివృద్ధికి టూరిజం శాఖ ప్రాధాన్యత ఇస్తోంది.
పర్యాటకుల రాకలో రికార్డులు..
రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగింది. 2023లో 5.84 కోట్లుగా ఉన్న దేశీయ పర్యాటకుల సంఖ్య 2024లో రికార్డు స్థాయిలో 8.82 కోట్లకు చేరింది. 2025 లో 8.48 కోట్ల మంది తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 2024తో పోలిస్తే 2025లో 10 శాతానికి పైగా పెరిగినట్లు శాఖ తెలిపింది.
రూ.23,741 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ..
టూరిజం కాన్‌క్లేవ్-2025 ద్వారా 24 మంది పెట్టుబడిదారుల నుంచి రూ.15,285 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లుగా శాఖ వివరాలు వెల్లడించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో 18 మంది పెట్టుబడిదారులతో రూ.8,456 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు రాగా, వీటి ద్వారా 10 వేల ప్రత్యక్ష, 30 వేల పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.
రూ.470 కోట్లతో పర్యాటక మౌలిక సదుపాయాలు..
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.181 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. వీటిలో బుద్ధవనం, రామప్ప, సోమశిల, నిజాంసాగర్, బల్కంపేట ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.289 కోట్ల వ్యయంతో 71 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
రోప్‌వేలు, అడ్వెంచర్ టూరిజం..
భువనగిరి కోట, ఖమ్మం కోటల వద్ద తొలిసారిగా రోప్‌వే ప్రాజెక్టులు, సోమశిల, హుస్సేన్ సాగర్, కోటిపల్లిలో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ప్రారంభించారు. హుస్సేన్ సాగర్‌లో ముచుకుంద లగ్జరీ డబుల్ డెక్ క్రూయిజ్ సేవలు ప్రారంభించారు. లక్నాపూర్, నిజాంసాగర్, వరదవెల్లి ప్రాంతాల్లో బోటింగ్ సౌకర్యాలను విస్తరించారు.
ప్రపంచ వేదికగా తెలంగాణ..
72వ మిస్ వరల్డ్-2025 పోటీలను తెలంగాణ విజయవంతంగా నిర్వహించి రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకు వచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, కళలు, హస్తకళలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించిందని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటుంది. 2026 ఉత్సవాల్లో 18 దేశాల ప్రతినిధులు, 37 అంతర్జాతీయ, 55 మంది దేశీయ కైట్ ఫ్లయర్లు పాల్గొన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్‌ల ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణలు జోడించామని మంత్రి చెప్పారు.
బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు..
బతుకమ్మ ఉత్సవాలు-2025 సందర్భంగా తెలంగాణ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అతిపెద్ద బతుకమ్మ పూల అలంకరణతో పాటు 1,354 మంది మహిళలతో నిర్వహించిన సమన్వయ బతుకమ్మ నృత్య ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
జాతీయ స్థాయిలో గుర్తింపులు ..
సోమశిల బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా–2024, నిర్మల్ బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా–2024 అవార్డులు అందుకున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌కు బెస్ట్ హెరిటేజ్ టూరిజం అవార్డు, బెస్ట్ ఇండిజినస్ క్యులినరీ డెస్టినేషన్ అవార్డు లభించాయని చెప్పారు. టీజీ - ఐపాస్ ద్వారా ఆన్‌లైన్ అనుమతులు, ఈ-ఆఫీస్, జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ టికెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాలు, పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను నియమించామని వెల్లడించారు. ఇటు హెరిటేజ్ టూరిజానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో క్రమం తప్పకుండా హెరిటేజ్ వాక్‌లు, హెరిటేజ్ రన్‌లో వేలాది మంది భాగస్వామ్యులు అయితున్నట్లుగా తెలిపారు.
కళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం..
1,690 మంది వృద్ధ కళాకారులకు నెలకు రూ.3,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. పలువురు ప్రముఖ కళాకారులకు ప్రత్యేక పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. రవీంద్రభారతిలో ప్రారంభించిన 99 రోజుల తెలంగాణ ప్రజా కళా కార్యక్రమం ద్వారా జానపద, గిరిజన, సంప్రదాయ కళారూపాలకు కొత్త ఊపిరి పోశామని మంత్రి జూపల్లి తెలిపారు.
పురావస్తు రంగంలో విశేష ఫలితాలు..
ఫణిగిరి, మాడుముల ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఫణిగిరిలో బౌద్ధ మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు పలు చారిత్రక కట్టడాల సంరక్షణ పనులు చేపట్టారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పునాస పత్రిక పునరుద్ధరణ, సాహిత్య వారం, దాశరథి శతజయంతి ఉత్సవాలు, రచయితల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
100 వీకెండ్ గేట్‌వే డెస్టినేషన్స్
99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా 100 వీకెండ్ గేట్‌వే డెస్టినేషన్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని మంత్రి తెలిపారు. పరిశుభ్రత, సౌకర్యాలు, స్థానిక ఉపాధి, వీకెండ్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
తెలంగాణకు కొత్త గుర్తింపు...
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటకం, సంస్కృతి, వారసత్వ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని అన్నారు. పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకాభివృద్ధి, వారసత్వ పరిరక్షణ, కళాకారుల సంక్షేమం అనే ఐదు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక, సాంస్కృతిక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా మరింత వేగంగా పని చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, కళాకారుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం, పర్యాటక మౌలిక సదుపాయాలను విస్తరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.






