- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు?
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడప్ చేసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటరు జాబితా తయారుచేయడానికి నోటిఫికేషన్ జారీచేసిన ఎన్నికల సంఘం సంబంధిత కమిషనర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడప్ చేసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటరు జాబితా తయారుచేయడానికి నోటిఫికేషన్ జారీచేసిన ఎన్నికల సంఘం సంబంధిత కమిషనర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఓటరు జాబితా తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వివరించారు. అయితే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను తయారుచేయడంతో పాటు వచ్చేనెల 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
అదేరోజు నుంచి ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జనవరి 10న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం వార్డులవారీగా, మున్సిపాలిటీ,మున్సిపల్ కార్పొరేషన్ వారీగా 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా వంటివాటిపై మున్సిపల్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది. అయితే మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఫల్గున్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్, అధికారులు పాల్గొన్నారు.
జనవరి నెలాఖరులో పురపోరు: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హుజూర్‌నగర్ కాంగ్రెస్ కేడర్ ఎన్నికలకు సిద్ధం కావాలని మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. శాసనసభ సమావేశాలు ముగియగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ క్రమంలో హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ప్రచార కార్యక్రమాలపై చర్చిద్దామని స్పష్టం చేశారు.






