CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు ఒక్కరి వల్లే కాలేదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-03-07 13:40:58  IST  )

రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy:  హైదరాబాద్ అభివృద్ధి  చంద్రబాబు ఒక్కరి వల్లే కాలేదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ మోడల్ (Gujarat Model) అవుట్ డేటెడ్ మోడల్ అయితే తెలంగాణ మోడల్ ప్రస్తుతం ట్రెండ్ లో నడుస్తున్న ట్వింటీ ట్వంటీ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్-2025 (India Today Conclave-2025) లో పాల్గొని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గుజరాత్ మోడల్ ను టెస్ట్ ఫార్మాట్ తో పోల్చారు. భివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు తెలంగాణ అభివృద్ధి నమూనా కలిగి ఉందన్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని మౌలిక సదుపాయాలు, హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు బేరీజు వేయాలన్నారు. మేము పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూసుకోవడం లేదని మా పోలిక అంతా న్యూయార్క్, సియోల్, టోక్యో, ఇతర దేశాలతో పోటీ పడుతున్నామన్నారు. అహ్మదాబాద్ కు తెలంగాణలో దేంట్లోనూ పోలిక లేదని చాలెంజ్ చేశారు. 3000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. ఐదేళ్లలో వచ్చి చూడండి. ప్రపంచంలోనే బెస్ట్ నగరాన్ని నిర్మించబోతున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ది రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తోనే ప్రారంభం కాలేదు. కులీ కుతుబ్‌షాల నుంచే హైదరాబాద్ అభివృద్ధి మొదలైందన్నారు. వారి తర్వాత నిజాం రాజులు, బ్రిటీషర్లు, స్వాతంత్య్రం అనంతరం మర్రి చెన్నారెడ్డి హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నేను పని చేస్తున్నాను. 450 ఏళ్ల చరిత్ర హైదరాబాద్ కు ఉంది. చార్మినార్, గోల్కొండ కోట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లను చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ నిర్మించారా అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న ల్యాండ్ మార్క్ డెవలప్ మెంట్ అంతా 450 ఏళ్ల క్రితం ప్రారంభమై రేవంత్ రెడ్డి వరకు కంటిన్యూగా వస్తోందన్నారు. సీఎంలు, పీఎంలు మారినా పాలసీలు మారకుండా అభివృద్ధి కొనసాగుతున్నదన్నారు.

మోడీతో నాకు గుడ్ రిలేషన్ షిప్:

దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి బేధాభిప్రాయాలు చూపకూడదు. నరేంద్ర మోడీ (PM Narendra Modi) గుజరాత్ లోని గిప్ట్ సిటిలో ఇన్వెస్టర్లకు ఇస్తున్న మినహాయింపులు హైదరాబాద్ కు ఎందుకు ఇవ్వడం లేదో నరేంద్ర మోడీ, బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు. పార్టీలు ఎప్పుడు కొట్లాడుతుంటాయి. ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిగా నేను ప్రధానమంత్రిని గౌరవిస్తాను. పొలిటికల్ పార్టీ ప్లాట్ ఫామ్ నుంచి మాట్లాడితే నా పార్టీ స్టాండ్ ప్రకారమే తప్పకుండా మాట్లాడుతాను. నరేంద్ర మోడీతో నాకు మంచి రిలేషన్ షిప్ ఉంది. ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వివాదాలు లేవు. మోడీని కేవలం పాలసీల పరంగానే విభేధిస్తున్నాను. మోడీ ఈ దేశానికి ప్రధాన మంత్రి. ఆయన్ను గౌరవించడం కలిసి మా రాష్ట్రానికి కావాల్సిన వాటిని తీసుకోవడం మా హక్కు, మావిధి కూడా అన్నారు.

బీజేపీ పగసాధింపులో భాగమే డీలిమిటేషన్:

3 నెలల్లో రూ.21 వేల కోట్లు రైతులకు మా ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎంత ప్రయత్నించినా తమను సౌత్ స్టేట్స్ ఓడిస్తున్నాయని అందుకే బీజేపీ బదులు తీర్చుకునేందుకు అవసరమైన అన్ని ఆయుధాలు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అందులో ఒకటి డీలిమిటేషన్ అన్నారు. సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గించేందుకే డీలిమిటేషన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సౌత్ స్టేట్ లు నియంత్రణకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు జనాభా ప్రకారం నియోజకవర్గాల విభజన అంటే ఎలా? అనా ప్రశ్నించారు. ప్రభుత్వం అంతా న్యాయబద్ధంగానే చేస్తుంటే ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ ను పిలవడం లేదన్నారు. కులగణన ద్వారా కులాల మధ్య రిజర్వేషన్ల పోరాటాలు వస్తాయన్న ప్రశ్నకు బదులిస్తూ ఎవరి వాటా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇస్తే సమస్య ఏంటి అన్నారు. బీసీలకు అన్యాయం చేసేందుకే జనగణనలో కులగణన చేయడం లేదన్నారు.

హిందీ జాతీయ భాష కాదు:

హిందీ జాతీయ భాష కాదని కేవలం ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమేనన్నారు. భాష విషయంలో బలవంతం ఉండకూడదని చెప్పారు. హిందీ (Hindi Language) కోసం ఇంత ప్రయత్నం చేస్తున్న బీజేపీ తెలుగు కోసం ఏం ఫెసిలిటీస్ కల్పించిందన్నారు. సివిల్ ఎగ్జామ్ లో తెలుగు భాషను తొలగించారు. ఈ దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. హిందీ ఆప్షనల్ అయితే ఎటువంటి సమస్య లేదు. కానీ ఎవరి నెత్తిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం వద్దన్నారు. ఇవాళ నేను హిందీలోనే మీకు బదులిస్తున్నాను కదా హిందీ నేర్చుకోండి కానీ బలవంతంగా రుద్దవద్దన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లే అవకాశం కల్పించడంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ అందరి మత విశ్వాసాలను గౌరవించడం ప్రభుత్వ విధానం అన్నారు.

మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ:

పార్టీలో ఎక్కువ స్వేచ్ఛ, ఎక్కువ ప్రజాస్వామ్యం కలిగి ఉండటం కూడా మా పార్టీ ఎన్నికల్లో ఓటములకు కారణం అన్నారు. 25 ఏళ్లు పదవులు అనుభవించి ఒక్క సారి రెన్యువల్ చేయని వారు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు. అంతటి స్వేచ్ఛ ఉంది. కానీ ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి బడా నేతలను పక్కన పెట్టినా బీజేపీలో ప్రశ్నించగలరా అన్నారు.

Next Story