- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ తెలంగాణ మధ్య ‘దిష్టి’ రాజకీయం.. పవన్ కల్యాణ్ క్షమాపణలు చెబుతారా?
పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ, తెలంగాణ మధ్య దిష్టి రాజకీయం ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఒకరి తర్వాత మరొకరు పవన్‍ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‍గా మారింది. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ విషయాన్ని తాను చెబుతున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించడం సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. దీంతో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం ఇరు రాష్ట్రాల రాజకీయాలను ఎటువైపు మలుపు తిప్పుతాయో అనేది సస్పెన్స్ గా మారింది.
అసలు పవన్ ఏమన్నారు?:
గత నెల 26 వ తేదీన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శంకరగుప్తం మెజర్ డ్రెయిన్ లోంచి వస్తున్న సముద్రపు జలాల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గోదావరి జలాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే. ఆ శాపం తగిలినట్టుంది. కోనసీమ గొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని, మీరం తెలంగాణ నాయకులంతా అంటారు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు. అత దిష్టి తగిలింది కోనసీమకు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ నేతల విమర్శలు
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ వారి దిష్టి తగలడం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు పాడవుతున్నాయనే అర్థంలో పవన్ వ్యాఖ్యలుచేయటం పట్ల తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైర్ అవుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి చాలా మంచివారని ఆయన బ్యాలెన్స్ డ్ గా మాట్లాడతారని కానీ పవన్ కల్యాణే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం బాధాకరం అన్నారు. కోనసీమకు తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారనడం అజ్ఞానం అని రాష్ట్ర ప్రజలకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే పవన్ సినిమాలు ఇక్కడ ఆడనివ్వమని హెచ్చరించారు. మైలేజ్ కోసం మెచ్యూరిటీ లేని మాటలను పవన్ మాట్లాడుతున్నారని మరో మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణ వనరులు వాడుకొని మీరు ఈస్థాయికి ఎదిగారు. మీకు తెలంగాణ ప్రజలు ఆలోచన విధానం తెలిసి కూడ మీరు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. మంత్రి పొన్నం స్పందిస్తూ ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే దానికి తెలంగాణ ప్రజలను పవన్ తప్పుపట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. తుపాన్‌లో తెలంగాణ మునుగుతుంటే ప్రకృతి వైపరీత్యం అనుకున్నాం తప్ప ఏపీ ప్రజలను తాము తప్పుపట్టలేదన్నారు. పవన్ వివేకవంతుడా అవివేక వంతుడా నాకు తెలియడం లేదన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు అక్కడ కూటమిగా ఉన్న తెలంగాణ బీజేపీ సైతం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందిస్తూ పవన్ కల్యాణ్ కు సిగ్గుంట్టే ఆయన వెంటనే కుటుంబసమేతంగా తెలంగాణను విడిచిపెట్టి ఏపీకి వెళ్లిపోవాలని విమర్శించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందిస్తూ పవన్ కల్యాణ్ నోరు అదుపులో లేకుండా మాట్లాడుతున్నారని, పిచ్చి మాటలు మాట్లాడే వాళ్లు కూడా ఉపముఖ్యమంత్రులు అవుతున్నారన్నారని విమర్శించారు.
ఆరు రోజుల తర్వా గరం గరం:
పవన్ వ్యాఖ్యలు చేసి ఆరు రోజులవుతోంది. ఇప్పటి వరుక ఒకరు ఇద్దరు తెలంగాణ నేతలు మినహా పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ అనూహ్యంగా నిన్నటి నుంచి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు పెరగడంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నా మొన్నటి వరకు మౌనంగా ఉన్న నేతలంతా ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు పవన్‍పై దాడి చేస్తున్నారని జనసేన నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై జరుగుతున్న ఎటాక్ వెనుక కారణాలు ఏమిటీ? అనేది చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్‍కు తెలంగాణ ప్రాంతం పట్ల ప్రత్యేక అభిమానం ఉందని చెబుతున్నారు. మొత్తంగా బనకచర్ల ఇష్యూ తర్వాత తెలంగాణ, ఏపీ మధ్య రాజకీయంగా అంతా సైలెంట్ అయిపోయింది. ఇటువంటి క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ మంటలు రాజేస్తున్న నేపథ్యంలో మరి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్తారా లేదా అనేది వేచి చూడాలి.






