- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పశుసంపద.. రైతులకు భారీగా రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్!
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం అత్యంత కీలకమైన జీవనాధారంగా నిలవగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25.82 లక్షల కుటుంబాలు పశుసంపదపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం అత్యంత కీలకమైన జీవనాధారంగా నిలవగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25.82 లక్షల కుటుంబాలు పశుసంపదపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. వాటిలో 12 లక్షల కుటుంబాలు ఆవులు, 10.5 లక్షల కుటుంబాలు గేదెలు, 6 లక్షల కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాయి. మొత్తంగా 42.32 లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 1.90 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు 7.99 కోట్ల కోళ్ల సంపద ఉంది. దీంతో రానున్న మరో మూడేళ్లలో ఈ సంఖ్య 10 కోట్లకు చేరేలా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పశుసంపదలో తెలంగాణలోనే 9.39 శాతం ఉండగా కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానం, పాలు, మాంసం ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో నిలిచింది. 2024-25 అంచనాల ప్రకారం పశుసంపద రంగం రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తికి రూ.1,03,525 కోట్ల విలువైన దాదాపు 5.1 శాతం వాటాను అందిస్తోంది. పశుసందప వృద్ధి జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 121 పశు వైద్య సంస్థలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్స్, ఒక వెయ్యి 30 గోపాలమిత్ర కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. దూర ప్రాంత గ్రామాల్లో కూడా పశు వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రైతుకు భరోసా పెరిగింది.
వైద్య సదుపాయం
పశువుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నియంత్రణకు విస్తృతంగా టీకాలు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 7 విడతలుగా టీకా కార్యక్రమం చేపట్టింది. ప్రతి విడతలో సగటున సుమారు 51 లక్షల పశువులకు టీకాలు వేయగా పశువుల చెవిపోగులు, నమోదు, డేటా అప్‌లోడ్ వంటి వ్యవస్థాపక చర్యలు కూడా చేపడుతోంది. ఈ కార్యక్రమం 100 శాతం కేంద్ర సహాయంతో కొనసాగుతుండగా పశువుల ఆరోగ్య రక్షణ ద్వారా రైతుకు నష్టాన్ని తగ్గించడం, పాలు, మాంసం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. వ్యాధి నియంత్రణ, సంతానోత్పత్తి, ఆరోగ్య, నట్టల నివారణ శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణ పశువైద్య కేంద్రాలను బలోపేతం చేస్తోంది. పశుగ్రాసం, దాణా కోసం మెరుగైన విత్తనాల సరఫరా, గడ్డి కోసే యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందిస్తోంది.
పాడి పరిశ్రమ కీలకం
డెయిరీ రంగం తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక పథకం కొనసాగిస్తోంది. రాష్ట్రంలో డెయిరీ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి 2018-19 నుంచి పాడి పశువుల పంపిణీ పథకాన్ని అమలవుతోంది. ఇప్పటివరకు 59,734 పాడి పశువులు పంపిణీ చేయగా డెయిరీ రంగంలోని మౌలిక సదుపాయాల బలోపేతం కోసం మిల్క్ కలెక్షన్ యూనిట్లు, డేటా ప్రాసెసింగ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్టింగ్ పరికరాలు వంటి సదుపాయాలు కల్పిస్తోంది. డెయిరీ ఉత్పత్తిదారుల శిక్షణ, నాణ్యత అభివృద్ధి, సేకరణ సామర్థ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గొర్రెలు, మేకల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నియంత్రణ, పోషణ, సేవల ప్రాప్తి వంటి అంశాలకు పరోక్షంగా పలు పథకాల కింద ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది.
మత్స్య రంగంలో అభివృద్ధి
మత్స్య రంగం కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ముఖ్యమైనదే. ఈ రంగ అభివృద్ధి కోసం సహకార వ్యవస్థల బలోపేతం, మార్కెటింగ్, శిక్షణ, సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇది కేవలం ఉత్పత్తి పెంపు కోసం మాత్రమే కాకుండా మత్స్యకార కుటుంబాల ఆదాయ రక్షణ, సామాజిక భద్రత, మార్కెట్ అనుసంధానం కోసం ప్రయత్నాలు చేస్తోంది. పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రోటీన్ ఆహారంగా పిల్లలకు చేపలను పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.






