భూముల ధరలు పెంపు.. బ్లాక్ మనీకి బూస్ట్!

by Naga Rani Yarlagadda |

తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైన వేళ మార్కెట్‌లో బ్లాక్‌మనీ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి.

భూముల ధరలు పెంపు.. బ్లాక్ మనీకి బూస్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైన వేళ మార్కెట్‌లో బ్లాక్‌మనీ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం తర్వాత రెండో రోజు నుంచి పెంచిన ధరలను అమలు చేయనున్నారన్న సమాచారంతో పాత ధరలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా భూ క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో భూముల వాస్తవ ధరలకు, మార్కెట్ ధరలకు మధ్య అంతులేని తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కెట్ ధర గజం రూ.1000 ఉన్నచోట ఓపెన్ మార్కెట్‌లో కనీసం రూ.10 వేలు ఉంది. అంటే రూ.9 వేలు బ్లాక్ దందాగానే కొనసాగుతున్నది. ఈ విషయం అందరికీ తెలిసిందే. వాస్తవ లావాదేవీలేవీలను ఎవరూ డీడ్‌లో పేర్కొనడం లేదు. మార్కెట్ రేట్ ప్రకారమే కొనుగోలు చేసినట్లుగా స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారు. దీంతో అంతటా బ్లాక్‌మనీతోనే ట్రాన్సాక్షన్స్ సాగుతున్నాయి. కూకట్‌పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, కోకాపేట ప్రాంతాల్లో నిర్మించే హైరైజ్డ్ బిల్డింగ్స్‌లో చదరపు గజం రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు అని, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు అంటూ బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. ఆఖరికి మెట్రో పిల్లర్లపైనా బహిరంగంగానే యాడ్స్ వేస్తున్నారు. నిజానికి అక్కడ రూ.4 వేల లోపే మార్కెట్ వ్యాల్యూ ఉంది. ఆ మేరకే స్టాంప్ డ్యూటీ కడుతున్నారు. ఇక మిగతా అమౌంట్ ఏం అవుతుంది? కంపెనీకి ఎలా చెల్లిస్తున్నారు? అనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఎవరి నుంచి ఎలాంటి యాక్షన్ ఉండదు. రెరా వంటి సంస్థలు కూడా ప్రచారానికి, రిజిస్ట్రేషన్‌కి మధ్య తేడాలను గుర్తించినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాస్త రేట్లు పెరుగుతున్నాయనగానే ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. మొత్తంగా 90 శాతం క్రయవిక్రయాలు బ్లాక్‌మనీతోనే అని స్పష్టంగా అర్థమవుతోంది.

పట్టణాల్లో 50 శాతం పెరుగుదల

ధరల పెంపు నేపథ్యంలో వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పని చేస్తాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అంటే 4వ తేదీ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుత మార్కెట్ ధరలు సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే స్లాట్ బుక్ చేసుకున్న వారికి వర్తించనున్నాయి. దీంతో ప్రాపర్టీస్ కొనేందుకు అడ్వాన్సులు చెల్లించినవారు, అగ్రిమెంట్లు కుదుర్చుకున్న వారు గడువుకంటే ముందే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు భారీ డిమాండ్ కనిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలో 20 శాతం అదనంగా ఉంటే, పట్టణ శివారు ప్రాంతాల్లో మాత్రం 50 శాతం అదనంగా లావాదేవీలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్లగొండ ఆర్వో, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటికిటలాడుతున్నాయి. రాత్రి పొద్దుపోయే దాకా స్లాట్లు కొనసాగుతున్నాయి.

అగ్రికల్చర్ డబుల్

వ్యవసాయ భూములు ప్రస్తుతం ఎకరం రూ.2.50 లక్షలు ఉంటే దాన్ని రూ.4.50 లక్షలకు పెంచుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 100 శాతం పెంచే అవకాశం ఉందని మంత్రి ప్రకటన ద్వారానే స్పష్టమైంది. వ్యవసాయం లేకపోయినా, భూముల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అందుకే రైతులెవరూ పక్కనున్న అర ఎకరం కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ వ్యాపారులు, ఉద్యోగులు మాత్రమే భూముల కొనుగోళ్లలో ముందున్నారు. నిజానికి రూ.4.50 లక్షలు చేసినా తక్కువేనన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో రూ.4.50 లక్షలకు ఎకరం భూమి ప్రాంతమేదీ లేదు. ఆఖరికి గుట్టలు, రాళ్లు ఉన్న ల్యాండ్ కూడా ఇంత తక్కువ ధరకు అమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కనీసం రూ.10 లక్షలు అనేది సర్వత్రా తెలిసిందే. అలాగే అపార్టుమెంట్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. చదరపు అడుగు ధర కనీసం 20 శాతం పెరగొచ్చని అంటున్నారు. అలాగే ప్లాట్ల ధరలు దాదాపుగా 50 శాతం పెరుగుతాయి. ఇప్పటికే కార్డ్ సాఫ్ట్‌వేర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో పెంచిన ధరలను అప్‌లోడ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమల్లోకి రానున్నాయి. అయితే స్టాంప్ డ్యూటీ యధావిధిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హైవే.. హై రేట్స్..

ప్రస్తుతం కొన్ని హైవేల పరిధిలో ఎకరం మార్కెట్ ధర రూ.2.50 లక్షలు కూడా ఉంది. ఇప్పుడది కనీసం రూ.10 లక్షలకు చేరనున్నట్టు అధికారులు అంటున్నారు. వెంచర్లు, వ్యవసాయేతర వినియోగం నేపథ్యంలో మెయిన్ రోడ్డు మీద ఎకరం రూ.కోట్లల్లో పలుకుతోంది. అందుకే ప్రభుత్వం కనీసం రూ.10 లక్షలుగా నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. హైదరాబాద్‌కి 100 కి.మీ. దూరంలో ఉన్నా మార్కెట్ వ్యాల్యూ మాత్రం రూ.10 లక్షల పైమాటే ఉంటుంది. దానికి తగ్గట్లుగానే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి వస్తుంది. నిజానికి ఫామ్‌హౌజ్‌ల పేరిట బడాబాబుల ఎస్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి. రైతుల చేతుల్లో ఉన్నవి అతి తక్కువ మాత్రమే. దీనివల్ల కూడా పెద్దోళ్లకే ఉపయోగపడే చాన్స్ ఉంది. మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా రూ.కోట్లల్లో బ్యాంకు లోన్లు పొందేందుకు మార్గం సుగమం కానున్నది.

ల్యాండ్ యూజ్‌‌ను బట్టి నిర్ణయం

వ్యవసాయం, వ్యవసాయేతర భూములు.. ఏవైనా ల్యాండ్ యూజ్ ఏదనే కోణంలోనే ఆలోచించినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో నాలా కన్వర్షన్ చేయకుండా వ్యవసాయేతర వినియోగం ఉంటే రేట్లు పెంచారు. నాలా కన్వర్షన్ కాకపోయినా వినియోగాన్ని బట్టి ధరలను నిర్ణయించినట్లు అధికారుల నుంచి సమాచారం. హైవేలపై అగ్రికల్చర్ ల్యాండ్ గానే రికార్డుల్లో ఉంది. కానీ వినియోగం మాత్రం మరొకటిగా కనిపిస్తుంది. రాష్ట్రంలో భూముల ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల‌ని కొన్ని ప్రాంతాల వాస్తవ ధ‌ర‌ల‌తో పోలిస్తే భారీగా హెచ్చు త‌గ్గులున్న భూముల ధ‌ర‌ల‌ను క్రమ‌బ‌ద్ధీక‌రించాల‌ని కేబినెట్ స‌మావేశంలో నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే జూన్ 4వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో రెండుసార్లు భూముల ధ‌ర‌ల‌ను అశాస్త్రీయంగా పెంచారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఇప్పుడేమో ఆర్థిక నిపుణులైన అర‌వింద్ సుబ్రహ్మణ్యం స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు శాస్త్రీయ ప‌ద్ధతిలో విశ్లేషించి ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తున్నామ‌ంటున్నారు. అయితే ధరలను ప్రకటించిన తర్వాత శాస్త్రీయమా, అశాస్త్రీయమా? అనేది తేలనుంది.

Next Story