తెలంగాణలో ప్రజాక్షేత్రంలోకి జనసేన విద్యార్థి విభాగం.. ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ!

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో జనసేన విద్యార్థి విభాగం పోస్టర్ ఆవిష్కరణ.. విద్యార్థుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రత్యేక పోరాటాలు!

తెలంగాణలో ప్రజాక్షేత్రంలోకి జనసేన విద్యార్థి విభాగం.. ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల హక్కులు, సమస్యల పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ (Janasena Party) సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు "జనసేన విద్యార్థి విభాగం" ("Jana Sena Student Wing") అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్ సంయుక్తంగా ఈ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏర్పాటు చేసిన జనసేన పార్టీ వేదికగా ఈ విద్యార్థి విభాగం మరింత బలంగా పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ.. వందలాది మంది అమరవీరుల, విద్యార్థుల బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ విద్యార్థులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి జనసేన విద్యార్థి విభాగం ప్రత్యేక కార్యాచరణతో త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రాబోతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు శిరీష కోట, సురేష్ రెడ్డి, ప్రజీత్ గౌడ్, తనీష్‌లతో పాటు విద్యార్థి విభాగానికి చెందిన పలువురు యువ నాయకులు పాల్గొన్నారు.

Next Story