- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే’.. సర్కార్‌కు తెలంగాణ జాగృతి హెచ్చరిక
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్‌నాయక్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్‌నాయక్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించి.. బస్సు ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మార్చేసిందని ఆరోపించారు. బస్సుల సంఖ్యను పెంచడాన్ని పక్కన పెట్టి చార్జీల భారాన్ని మోపిందని పేర్కొన్నారు. పండుగల పేరుతో ప్రజలపై అదనపు చార్జీల భారాన్ని మోపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. పండుగ ముగియగానే సిటీలో చార్జీలను భారీగా పెంచిందని అన్నారు.
ఒక్క స్టేజీ దాటితే రూ.10 అదనపు చార్జీ అంటే సామాన్యులు, నిత్యం పని చేసుకుంటేనే బతికేవారి పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత అన్ని చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ తప్పుడు విధానాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నదని అన్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజలతో కలిసి తెలంగాణ జాగృతి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రావు, యువ జాగృతి అధ్యక్షుడు శివారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.






