తెలంగాణ అన్ స్టాపబుల్... ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణ అన్ స్టాపబుల్... ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్ లో ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్(ఐబీసీ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ – 2025’ను లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర పురోగతి భాగస్వామ్యం అయ్యేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను మంత్రి కోరారు. మొదట్లో చాలా మంది తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్నారు. కానీ.. ఆనతి కాలంలోనే తెలంగాణ అన్ స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందని చెప్పారు.

రాష్ట్ర జీడీపీ రూ.16.12 లక్షల కోట్లకు చేరిందని, 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9శాతం)ను దాటేసిందని చెప్పుకొచ్చారు. తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సేకరించామని, గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్ లో రూ. 40వేల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు. అంతే కాకుండా 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని పేర్కొన్నారు. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం. దేశంలో ఇది 55 శాతంగా ఉంది. ఇవి అంకెలు కాదు... తెలంగాణ పురోగతికి నిదర్శనాలు’ అని మంత్రి వివరించారు. ప్రతి భాగస్వామ్యం ఒక లావాదేవీ కాదు... అది ఒక మార్పు.

అందుకే అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజిటల్ ఫార్మింగ్, ఫ్యూచర్–రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశాల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మిగిలిన రాష్ట్రాలు ట్రెండ్‌ను అనుసరిస్తే, తెలంగాణ దాన్ని సృష్టిస్తుందని, అందుకే కేవలం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే రావొద్దు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు కలిసి రండి’ అని పిలుపునిచ్చారు. ‘బ్రెజిల్, జర్మనీ, రష్యా, కామెరూన్, మాల్టా, యూకే, బల్గరేయా, బెల్జియం, యూఏఈ, దుబాయి తదితర 25 దేశాల ప్రతినిధులు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామమని, ఇది ఒక సదస్సుగా మిగిలిపోకుండా వివిధ దేశాల మధ్య సంస్కృతి, వ్యూహాలు, టెక్నాలజీ బదలాయింపునకు వారధిగా నిలవాలని మంత్రి కోరారు.

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సహాకాలను మీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు వివరించండి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిప్లోమేటిక్ రిలేషన్స్(ఐవోడీఆర్) మాల్టా గవర్నర్ లిల్లో మర్రా, కార్యదర్శి మార్సెల్లో పట్టి, బెల్జియం ఎంపీ ఇవాన్ పెట్రోవ్, జర్మనీ డిప్లోమాట్ డానియల్ జెర్బిన్, అర్జెంటీనా ఎంపీ క్లాడియో సింగోలనీ, ఐబీసీ ఛైర్మన్ సాల్మన్ గట్టు, డైరెక్టర్ గ్లోరియా సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Next Story