గ్లోబల్ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది.. టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

by Kema Shiva Kumar |

తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా TGCHE చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డితో న్యూకాసిల్ యూనివర్సిటీ ప్రతినిధుల భేటీ అయ్యారు.

గ్లోబల్ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది.. టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ యువ రాష్ట్రంగా రక్షణ తయారీ, ఔషధ రంగం, ఐటీ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి అన్నారు. పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు నైపుణ్యాధారిత కోర్సులను, వినూత్న సిలబస్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఏఐ ఆధారిత ట్యూటర్లు, కోడింగ్ సపోర్ట్ వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రతిష్టాత్మక న్యూకాసిల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం మంగళవారం టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా న్యూకాసిల్ యూనివర్సిటీ ప్రతినిధులు సింగపూర్, మలేషియా దేశాల్లో తమ ఆఫ్-క్యాంపస్ కేంద్రాలు ఉన్నాయని, భారతదేశంలో కూడా ఆఫ్-క్యాంపస్ కేంద్రాల స్థాపన కోసం పలు నగరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సమావేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, సస్టైనబుల్ నగరాలు, అగ్రో బిజినెస్, మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే సింగపూర్, మలేషియాల్లో ఆఫ్-క్యాంపస్ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, అదే తరహాలో భారతదేశంలో కూడా కేంద్రాన్ని స్థాపించేందుకు అనువైన నగరాలను పరిశీలిస్తున్నామని న్యూకాసిల్ ప్రతినిధులు వెల్లడించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ', ఏఐ యూనివర్సిటీ, 'ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్టుల గురించి చైర్మన్ వివరించారు. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్య సాధనలో ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధి కీలకమని, ఇందులో న్యూకాసిల్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎంతో కీలకం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూకాసిల్ యూనివర్సిటీ బృందం తమకున్న యుకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) అనుబంధాన్ని, డేటా అనలిటిక్స్, అగ్రో బిజినెస్‌లో విద్యార్థులకు అందిస్తున్న ప్రాక్టికల్ అనుభవాన్ని వివరించింది. ఈ సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో ముగిసింది. భవిష్యత్తులో పరస్పర సహకారానికి మార్గాలను అన్వేషించాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. ఈ బృందంలో ప్రొఫెసర్ స్టీవర్ట్ రాబిన్సన్ (డీన్, ఆపరేషనల్ రీసెర్చ్), డాక్టర్ ఆదిత్య నారాయణ్ శర్మ (గ్లోబల్ స్పెషల్ అడ్వైజర్ – ఇండియా), శ్రీ బ్యారీ హాడ్గ్సన్ (డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డేటా), సంజనా మెడిపల్లి (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పార్ట్‌నర్‌షిప్) పాల్గొన్నారు.

Next Story