ఎన్ క్యాప్ కృషి.. ఎయిడ్స్ నియంత్రణలో తెలంగాణ ఆదర్శం

by Naga Rani Yarlagadda |

ఎయిడ్స్ నియంత్రణలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఎన్ క్యాప్ కృషి.. ఎయిడ్స్ నియంత్రణలో తెలంగాణ ఆదర్శం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎయిడ్స్ నియంత్రణలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. హెచ్‌ఐవీ నియంత్రణకు బలమైన విధానాలు, సమగ్ర కార్యక్రమాలు, కమ్యూనిటీ ఆధారిత చర్యలతో దేశం గణనీయమైన పురోగతి సాధించింది. హెచ్ఐవీ బాధితుల హక్కులను రక్షించే హెచ్ఐవీ, ఎయిడ్స్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) చట్టం-2017 ఈ పోరాటంలో కీలక మైలురాయిగా నిలిచింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్(ఎన్ క్యాప్) ఐదు దశల్లో అభివృద్ధి చెందుతూ నివారణ, పరీక్షలు, చికిత్స, వైరల్‌లోడ్ మానిటరింగ్ వరకు విస్తరించింది. 1992లో ప్రారంభమైన ఎన్ క్యాప్ ప్రస్తుతం 2021-2026 మధ్య ఐదో దశలో కొనసాగుతోంది. ఈ దశ ప్రధాన లక్ష్యం 2030 నాటికి ఎయిడ్స్‌ను ప్రజారోగ్య ముప్పు నుంచి పూర్తిగా తరిమేయడంగా నిర్దేశించుకున్నారు. 2025 నాటికి సుమారు 50శాతానికి పైగా ఎయిడ్స్ నియంత్రణకు ఎన్ క్యాప్ కృషి చేసింది. భారత్‌లో ఎన్ క్యాప్ కార్యక్రమాల ఫలితంగా కొత్త హెచ్‌ఐవీ సంక్రమణలు తగ్గగా, ఏఆర్టీ చికిత్స పెద్దఎత్తున విస్తరించింది. మిషన్ సంపర్క్, టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ, డీఏపీసీయూ వంటి చర్యలు గ్రౌండ్‌ లెవెల్‌లో వ్యాధి నియంత్రణను బలోపేతం చేశాయి. నేడు(డిసెంబర్ 1) వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా భారత్ మరలా ఎయిడ్స్ నియంత్రణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం, కమ్యూనిటీలు, ఆరోగ్య సంస్థలు కలిసి పనిచేస్తూ ఎయిడ్స్ రహిత భారతానికి దారి చూపిస్తున్నాయి. రూ.15,471.94 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఐదో దశ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం(2021-2026) గత విజయాలతో మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది. 2025 థీమ్ ‘అడ్డంకులను అధిగమిస్తూ, ఎయిడ్స్ నియంత్రణ’ పేరుతో మహమ్మారిపై ప్రపంచం పోరాడుతోంది.

తెలంగాణలో హెచ్ఐవీ, ఎయిడ్స్ గణాంకాలు

2025 జనవరిలో తెలంగాణలో 1,37,426 మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారు. ఏఆర్టీ(వైరస్) చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో స్త్రీలు 69,940, పురుషులు 60,640, కాగా 781 మంది ట్రాన్స్‌జెండర్స్. 2024లో నిర్వహించిన సుమారు 19.02 లక్షల మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా, అందులో 9,415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో హెచ్ఐవీ వ్యాప్తి పూర్తిగా ముగిసిపోలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణ చర్యలు, అందుబాటు చికిత్స వల్ల పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికం

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. మిజోరంలో 2.7, నాగాలాండ్ 1.5, మణిపూర్ 1.1, త్రిపుర 0.8, మేఘాలయ 0.7 శాతంతో దేశంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధిత రాష్ట్రాల్లో ముందున్నాయి. ఇక హెచ్ఐవీ, ఎయిడ్స్ మధ్యస్థ ప్రభావం ఉన్న రాష్ట్రాలుగా తెలంగాణ 0.47, ఆంధ్రప్రదేశ్ 0.45, కర్ణాటక 0.39 తమిళనాడు 0.32, మహారాష్ట్ర 0.28 శాతంగా ఉన్నాయి. తక్కువ ప్రభావిత రాష్ట్రాలుగా ఒడిశా 0.2, ఢిల్లీ 0.18, పశ్చిమ బెంగాల్ 0.15, కేరళ 0.13, రాజస్థాన్ 0.11, బిహార్ 0.07, ఉత్తరప్రదేశ్ 0.05, జార్ఖండ్ 0.05 శాతంగా ఉన్నాయి.

Next Story