- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పరీక్షల ఏర్పాట్లు పూర్తిచేసిన ఇంటర్ బోర్డు
రాష్ట్రంలో పరీక్షల సందడి మొదలుకానుంది. రేపటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరీక్షల సందడి మొదలుకానుంది. రేపటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాల నిఘా ఉంటుందని, మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినట్లు తెలిపారు. రేపటి నుండి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హారుకానున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1495 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మొత్తం 1495 పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404, ప్రైవేట్ కళాశాలలు 863 ఉన్నాయి. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 489126 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 507949 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 1495 చీఫ్ సూపరింటెండెంట్లు, 1495 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్వాడ్స్ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్నికల్ సమస్యల వల్ల హాల్ టిక్కెట్లు రాని విద్యార్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేసినట్లు తెలిపారు.
కట్టుదిట్టమైన నిఘా:
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఒక్కో పరీక్షా కేంద్రానికి 3 నుండి 6 కెమెరాలతో నిఘా చేపట్టినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సిసి కెమెరాలను అమర్చారు. వీటన్నింటినీ హైదరాబాద్ నాంపల్లి లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 75 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించరని పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ tgbie.cgg.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. ఏ కారణం చేతనైనా హాల్ టికెట్లు ఆపవద్దని కాలేజీ యాజమాన్యాలను బోర్డు ఆదేశించింది. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఫర్నిచర్, మెడికల్ కిట్లు, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ఉండేందుకు టెలిమానస్ ద్వారా కౌన్సెలింగ్ సౌకర్యం కల్పించారు. విద్యార్థులు 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చని తెలిపారు.






