- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్లు
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

- మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో..
- పేదలు ఉన్నచోటే జి+3 పద్ధతిలో నిర్మాణం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- స్థలాల గుర్తింపుపై 4 జిల్లాల కలెక్టర్లతో సమావేశం
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటనే జి+3 పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం సెక్రెటేరియట్‌లో హౌసింగ్ అధికారులతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లతో పట్టణాలలో ఇందిరమ్మ, 2 బీహెచ్‌కే ఇండ్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లలోకి వెళ్లడం లేదని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని త్వరలో మొదటిదశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి అక్కడే జి+3 పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి వీలుగా స్థలాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు వ్యక్తులకు చెంది పేదల అధీనంలో ఉన్న వాటితోపాటు కబ్జాకు గురైన ప్రాంతాలను కూడా గుర్తించాలన్నారు. అదేవిధంగా భూదాన్ భూములను పేదల ఇండ్ల కోసం వినియోగించే వెసులుబాటు ఉన్నందున అటువంటి భూములను గుర్తించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, దీనికోసం ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు.
మురికివాడల్లో 42,432 మంది..
జీహెచ్ఎంసీ పరిధిలోని 166 మురికివాడలల్లో సుమారు 42,432 మంది నివసిస్తున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడలలో సర్వే నిర్వహించి 25,501 కచ్చా ఇండ్లలో పేదలు ఉంటున్నట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. దీనిపై మరింత లోతైన పరిశీలన జరిపి ఎన్ని మురికివాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది, జి+3 పద్ధతిలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించవచ్చు అనే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు. పట్టణ నియోజకవర్గాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకొని అదనంగా ఇండ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
వృథాగా 30వేల 2 బీహెచ్‌కేలు..
సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిల్లో కేటాయించిన 2 బీహెచ్‌కే ఇండ్లలోకి వెళ్లడానికి హైదరాబాద్‌లో నివసిస్తున్నవారెవరూ ఇష్టపడడం లేదని.. ఫలితంగా 30 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇండ్ల కేటాయింపు పొంది అక్కడ నివసించని వారందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 2 బీహెచ్‌కేలను పూర్తిచేయాలని.. అలాగే వాటర్, కరెంట్, డ్రైనేజ్ వంటి కనీస వసతులను కల్పించి మిగిలిపోయిన 2 ఇండ్లను ఆగస్టు నెలాఖరులోగా కేటాయింపులు పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ వీపీ గౌతమ్, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్‌వీ కర్ణన్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హౌసింగ్ కాలనీస్ ఇన్‌స్పెక్షన్ యాప్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు.






