గోల్కొండలో ఆవిర్భావ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 12 |
గోల్కొండలో ఆవిర్భావ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. గోల్కొండ వేదికగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ వేడుక కొనసాగనుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సైతం నిర్వహించనుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండ్రోజుల పాటు కార్యక్రమాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రెండ్రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది. జూన్ 2, 3 తేదీల్లో ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

జూన్ 2వ తేదీన ఉదయం 6:30 గంటలకు గోల్కొండ ఖిల్లా పై జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఎగుర వేయనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జూన్ 3న సాయంత్రం సైతం సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం గురించి కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో పలువురు జాతీయ పార్టీ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. కళాకారులు మంజుల రామస్వామి అండ్ గ్రూప్, ఆనంద శంకర్ అండ్ గ్రూప్, ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్, సింగర్ మంగ్లీ, మధుప్రియ తమ పాటలతో అలరించనున్నారు. అంతేకాకుండా ‘ఖిల్లా ఔర్ కహానీ’ పేరిట పాఠశాల విద్యార్థులకు ఫోటో, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఫొటో, పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను సైతం అక్కడ ఏర్పాటు చేయనున్నారు.

పోటా పోటీగా నిర్వహణ

రాష్ట్ర అవరతరణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధికార బీఆర్ఎస్‌కు దీటుగా నిర్వహించాలని భావిస్తోంది. ఆవిర్భావ వేడుకల పోటాపోటీ నిర్వహణ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఎవరికి వారుగా ఈ వేడుకను క్లెయిమ్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కోసం ఉద్యమించింది తామేనని ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.., పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్, బీజేపీకి చెంది 160 మంది ఎంపీలు లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని బీజేపీ సైతం తమ వాయిస్‌ను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. గతంలో అధికారికంగా విమోచన వేడుకలను నిర్వహించిన బీజేపీ తాజాగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Next Story