మీడియా అక్రెడిటేషన్ల జీవోపై.. ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

by Naga Rani Yarlagadda |

మీడియా అక్రెడిటేషన్ల జీవోపై.. ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర,జిల్లా స్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ 229ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నిబంధనల అమలుపై ఉన్న అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి కోర్టు సంజాయిషీ కోరింది. జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ మొహినుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్రధానంగా అక్రెడిటేషన్ కమిటీల కూర్పును తప్పుబట్టారు. గతంలో అమల్లో ఉన్న జీవో 252 నిబంధనల ప్రకారం.. అక్రెడిటేషన్ కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉందని, అయితే ప్రస్తుత జీవో 229 ద్వారా ప్రభుత్వం ఆ నిబంధనలను పక్కన పెట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్‌కు అవకాశం ఇవ్వకుండా, కేవలం మూడు యూనియన్లతోనే కమిటీలను ఏర్పాటు చేసి కార్డులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలను తుంగలో తొక్కినందున ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశించింది. అయితే, ఈ రిట్ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్ తనకు అందలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా, దానిపై పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్లీడర్‌కు జీపీ పిటిషన్ కాపీలు అందజేయకుండా కోర్టులో కేసు నంబర్ నమోదు కావడం అసాధ్యమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story