- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాల్లేవు.. బిల్లులు చెల్లించరు.. ఉచితాలు ఎవరడిగారు : హైకోర్టు సీరియస్
రాష్ట్రంలో పేద యువతుల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల జీవోల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

- ఉచితాలు ఇవ్వాలని ఎవరైనా అడిగారా..
- చట్టబద్ధత లేకుండానే వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు..
- ఆరు శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు.. కౌంటర్‌కు 4 వారాల గడువు..
- పిటిషన్‌పై విచారణ ఆగస్టు 5కు వాయిదా..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పేద యువతుల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల జీవోల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో చట్టసభల ఆమోదం లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నిధుల వ్యయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
ప్రజాధనాన్ని పంపిణీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోలను కొట్టివేయాలని కోరుతూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభం కాగానే.. పేద యువతులకు లబ్ధి చేకూర్చే ఈ సంక్షేమ పథకాల విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎందుకు జోక్యం చేసుకోవాలి.. అని న్యాయమూర్తి పిటిషనర్‌ను ప్రశ్నించారు. దీనికి విజయ్ గోపాల్ బదులిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 245, 246 ప్రకారం ఇలాంటి పథకాలకు చట్టబద్ధత ఉండాలని, చట్టసభల ఆమోదం లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా ప్రజాధనాన్ని పంపిణీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.
ఉచితాలు ఇవ్వాలని ఎవరైనా అడిగారా..
పిటిషనర్ వాదనలు విన్న జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, నిధుల వ్యయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో రాష్ట్రం ఎలా వ్యవహరించాలనే దానిపై న్యాయస్థానం మార్గనిర్దేశం చేయలేదు. కానీ, నిధులను ఖర్చు చేయడంలో ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట ప్రాధాన్యత ఉండాలి కదా.. భూములు కోల్పోయిన పౌరులకు ఆర్థిక ఇబ్బందుల పేరుతో పరిహారం ఇవ్వని కేసులు మా ముందుకొస్తున్నాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మున్సిపాలిటీలకు బిల్లులు చెల్లించడం లేదు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావడం లేదు. పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు అందక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. చివరకు న్యాయవ్యవస్థలో అడ్‌హాక్‌గా పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు. డబ్బుల కోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. రేపు ఏవైనా కొత్త ఆసుపత్రులు కట్టాలంటే భూములు ఎక్కడుంటాయి భవిష్యత్తు అవసరాల కోసం వాటిని కాపాడాలి కదా.. ఉచితాలు ఇవ్వాలని ఎవరైనా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారా.. మీ వద్ద అదనపు నిధులు ఉంటే ఇవ్వొచ్చు, కానీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉండాలి అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రూ. 90 కోట్లు అనర్హుల పాలు..
పిటిషనర్ విజయ్ గోపాల్ తన వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 2014లో రూ. 51 వేలతో ఈ పథకాన్ని ప్రారంభించి, ఎటువంటి చట్టబద్ధత లేకుండానే ఆ మొత్తాన్ని పలు దఫాలుగా పెంచుకుంటూ వచ్చి ఏకంగా రూ. 1,00,116కు, వికలాంగులకు రూ. 1,25,145కు చేర్చిందన్నారు. 2014 నుంచి 2026 వరకు పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ. 13,484.69 కోట్లను ఈ పథకాల కింద ఖర్చు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగ్ నివేదిక ప్రకారం 2026 జనవరి 1 నాటికి రాష్ట్రం రూ. 55,884 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల 2026 మార్చి నెలలోనే సుమారు రూ. 90 కోట్లు అనర్హులకు, వివాహిత మహిళలకు వెళ్లాయని.. ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి రికవరీ చేయడం అసాధ్యమని వాదించారు.
ఆర్థిక పరిస్థితి బాగుంది..
ఏఏజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ వర్గాలకు చెందిన పేద యువతులను ఆదుకునేందుకే ప్రభుత్వం 2014లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు తమకు 4 వారాల సమయం కావాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి గడువు మంజూరు చేశారు. ఈ జీవోలపై స్టే విధించాలని కోరుతూ పిటిషనర్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు పై తదుపరి విచారణను 2026, ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేశారు.






