మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే సంకెళ్లు వేయండి: హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

by Gantepaka Srikanth |

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే సంకెళ్లు వేయండి: హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని భూముల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం హైడ్రా అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది. లోతుకుంటలోని ఆర్మీ భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ, పోలీసులు కానీ వెళ్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే సంకెళ్లు వేయాలని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అధికారులు ఆర్మీ భూముల్లోకి వస్తే వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవాలని భద్రతా వర్గాలకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కోర్టుకు వెంటనే సమాచారం ఇవ్వాలి..

మళ్లీ ఎప్పుడైనా ఆర్మీ భూముల జోలికి హైడ్రా వస్తే, ఆ విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. లోతుకుంటలోని భూముల విషయంలో జోక్యం చేసుకోవడంపై రెండు రోజుల క్రితమే హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించినప్పటికీ, అధికారుల వైఖరి మారకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ పేరుతో ప్రైవేట్, వివాదాస్పద భూముల్లోకి అనుమతి లేని రీతిలో ప్రవేశించడం, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంపై హైకోర్టు క్లాస్ పీకడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story