- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి
స్నేహితుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువకులను విధి ప్రమాదం రూపంలో కబళించింది.

దిశ, వెబ్‌డెస్క్: స్నేహితుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువకులను విధి ప్రమాదం రూపంలో కబళించింది. వారు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెరువులో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు యువకులు నీటిలో ఊపిరిరాడక ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఒడిశాలోని ధెంకనాల్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 నుంచి 28 ఏళ్ల వయస్సున్న ఏడుగురు స్నేహితులు కారులో తమ మిత్రుడి పెళ్లికి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ధెంకనాల్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిపూర్ గ్రామం వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. చీకటిగా ఉండటం, రోడ్డుపై ఉన్న మలుపును డ్రైవర్ సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
చెరువులోకి పడే ముందే దూకేసిన ఇద్దరు
కారు నీటిలో పడిపోతుండటాన్ని గమనించిన ఇద్దరు యువకులు వాహనం నుంచి బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే.. మిగిలిన ఐదుగురు కారు లోపలే చిక్కుకుపోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నీటిలో మునిగిపోయిన కారు నుంచి మిగిలిన ఐదుగురిని బయటకు తీసేటప్పటికే వారికి ఊపిరిరాడక ప్రాణాలు కోల్పోయారని ధెంకనాల్ సదర్ ఇన్ స్పెక్టర్ ప్రియబ్రత్ దాస్ తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని శ్రీరామ్ సాహు (25), అభినాష్ సాహు (28), రాకేష్ కుమార్ సాహు (25), చంద్రకాంత్ స్వైన్ (27), అభిజిత్ సాహు (25)లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ధెంకనాల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో చెరువులోని కారును వెలికితీసిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి పెళ్లికి వెళ్తూ ఐదుగురు యువకులు ఒక్కసారిగా మృతి చెందడంతో వారి గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.






