అధ్వాన్నంగా బీబీ నగర్ ఎయిమ్స్.. కేంద్రమంత్రులకు హరీశ్ రావు సవాల్

by Disha Web Desk 2 |
అధ్వాన్నంగా బీబీ నగర్ ఎయిమ్స్.. కేంద్రమంత్రులకు హరీశ్ రావు సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీబీ నగర్ ఎయిమ్స్ అధ్వాన్నంగా ఉన్నదని మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ విషయంలో ఒక నీతి, రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో బీజేపీ ఒక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఒకే దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ఈ రకమైన వైఖరి సరికాదన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు ఎయిమ్స్‌కి ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. వైద్య విద్య విషయంలో కేంద్రానికి ఒక పాలసీ, రాష్ట్రానికి ఒక పాలసీ ఏం అవసరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్‌లు, ప్రొఫెసర్‌లు లేకుండానే ఎయిమ్స్‌‌ను నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను నిమ్స్‌ను, బీబీ నగర్ ఎయిమ్స్‌ను పరిశీలిoచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని భువనగిరి ఆసుపత్రిలో ట్రైనింగ్‌కు అనుమతి ఇచ్చామన్నారు. ఎయిమ్స్‌కు 200 ఎకరాల భూమి, రూ.200 కోట్ల విలువైన భవనాలు ఉచితంగా ఇచ్చామన్నారు. రూ.500 కోట్ల ఆస్తి ఇస్తే ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎయిమ్స్ ఏర్పాటు చేసి మూడేళ్లైనా వసతులు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు తెలంగాణ వైద్యుల మనోస్థైర్యం దెబ్బ తీసేలా మాట్లాడటం తగదన్నారు.

కేంద్రమంత్రులు రాజకీయం చేయడానికి వస్తున్నారా? అభివృద్ధి కోసం వస్తున్నారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయాలనుకుంటే.. బీబీ నగర్ ఎయిమ్స్‌ను వృద్ధి చేయండని సూచించారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రిను విజిట్ చేసిన ఆయన వైద్య సేవలపై ఆరా తీశారు. పలు వార్డులు తిరుగుతూ పేషెంట్లను పలకరించారు. ఆసుపత్రికి ఇంకా కావాల్సిన సదుపాయాలు కోసం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రానికి వస్తోన్న కేంద్ర మంత్రులు స్టేట్‌కు ఏమైనా ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి మంచి పనులు నేర్చుకొని వెళ్ళండంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ పథకాలు బీజేపీ పాలితరాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో పిడియాట్రిక్ ఐసీయూ, సర్జరీ ఐసీయూ, ఎంఐసీయూ, సెమినార్ హాల్‌లను ప్రారంభించారు.



Next Story

Most Viewed