ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం : మంత్రి సీతక్క హామీ

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ సంరక్షణలో పెరిగి, స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్న ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది.

ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం : మంత్రి సీతక్క హామీ
X
  • రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో 1050 మంది పిల్లలకు ధ్రువీకరణ పత్రాల మంజూరు
  • మీ బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ సంరక్షణలో పెరిగి, స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్న ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. వారి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు అడ్డంకులు కలగకుండా రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1055 మంది విద్యార్థులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ-ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పత్రాలను అందజేశారు

మీ భవిష్యత్తుకు ఇవే పునాదులు: మంత్రి సీతక్క

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆఫ్టర్ కేర్ పిల్లలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ధ్రువీకరణ పత్రాల లేమి అని, దానిని గుర్తించి తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించిందని తెలిపారు. "ఈ ధ్రువపత్రాలు కేవలం కాగితాలు కావు.. ఇవి మీ భవిష్యత్తుకు బాటలు వేసే సాధనాలు. కుటుంబ ఆదరణ లేకపోయినా కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చిన మీ పోరాట పటిమ అభినందనీయం అని విద్యార్థులను కొనియాడారు. మంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రూ. 10 లక్షల ఉచిత వైద్య సదుపాయం కల్పించే ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. గతంలో సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుందని ఆమె స్పష్టం చేశారు.

మత్తుకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. మీ జీవితాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారు ఉంటారు, కానీ మీరు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ సందర్భంగా “సే నో టు డ్రగ్స్” పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈగల్ ఫోర్స్ సంస్థ సౌజన్యంతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తూ.. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా, ప్రతి చిన్నారి భద్రత కోసం, ప్రతి యువకుడి అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలను చేరవేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే వేలాది ధ్రువపత్రాలు అందజేయడం జరిగిందని, మిగతా ప్రక్రియలు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, వచన్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి, ఈగల్ ఫోర్స్ అధికారులు గిరిధర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Next Story