- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించాలి : మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర హౌసింగ్, పరిశ్రమల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి
- సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి
దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర హౌసింగ్, పరిశ్రమల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. గురువారం సెక్రెటేరియట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారం అంశాలపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని.. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో నియోజకవర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని.. అలాగే క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణ చేపట్టిందన్నారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా వెయ్యి నుంచి 1,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని.. మూడు, నాలుగవ విడతల్లో కూడా మంజూరు చేస్తామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వంద శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన స్టీల్, సిమెంట్‌ను తక్కువ ధరకే అందించాలని మంత్రులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. పరిశ్రమలు, హౌసింగ్ అధికారులు ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారునికి ఏ విధంగా మెటీరియల్ చేరవేయాలన్న దానిపై రూట్ మ్యాప్ తయారు చేయాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల యాజమాన్యాలతోపాటు హౌసింగ్ సెక్రెటరీ వీపీ గౌతమ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రెటరీ కృష్ణాదిత్య, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.






