- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సబ్‌స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు.. 9 ఉమ్మడి జిల్లాల్లో 19 మెగావాట్ల సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్ట్
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, చౌకైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

- రూ. 66.50 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటుకు ఆదేశాలు
- 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, చౌకైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ సబ్‌స్టేషన్ లెవెల్ సోలారైజేషన్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 18 సబ్‌స్టేషన్లలో (33/11 కేవీ) మొత్తం 19 మెగావాట్ల సామర్థ్యం గల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇంధన శాఖ జీవో విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును రూ. 66.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో (జీఓఎంఎస్ నం.11) ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జారీ చేశారు.
2029-30 నాటికి 20 వేల మెగావాట్లే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 ప్రకారం.. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో 20వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2047 నాటికి నెట్ జీరో (కర్బన ఉద్గారాల రహిత) లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా లోడ్ సెంటర్లకు సమీపంలోనే సోలార్ పవర్ ప్లాంట్లను అభివృద్ధి చేయడం వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది.
డిస్కామ్‌ల వారీగా కేటాయింపులు
ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం అయ్యే రూ.66.50 కోట్ల నిధులను ఆయా డిస్కామ్‌లే భరించనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ 8 సబ్‌స్టేషన్లలో 8 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో 10 సబ్‌స్టేషన్లలో 11 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు నోడల్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా టీజీరెడ్కో వ్యవహరించనుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఈపీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. అదిలాబాద్ జిల్లాలో స్థల కేటాయింపుఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తామసి (తాళమడుగు) మండలం కజ్జర్ల పరిధిలోని సర్వే నెంబర్ 142లో గల 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కజ్జర్ల సబ్‌స్టేషన్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం టీజీఎన్‌పీడీసీఎల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
73.25 ఎకరాల భూమిలో 19 మెగావాట్ల సామర్థ్యం
ఈ ప్రాజెక్ట్ కింద టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో బాదేపల్లి, కోసిగి, నల్గొండ ఉమ్మడి జిల్లాలో చాడ, సిరికొండ, మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలో తునికిఖల్సా, ఆందోల్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కేశంపేట, మోమిన్‌పేట సబ్‌స్టేషన్లను ఎంపిక చేశారు. టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మాచాపూర్, మొండ్రాయి, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తల్లాడ, అంకంపాలెం, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని బోయినపల్లి, గంగాధరలో, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కోస్లి, గాంధారి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చెన్నూరు, కజ్జర్ల సబ్‌స్టేషన్లను ఎంపిక చేశారు. మొత్తంగా 18 సబ్‌స్టేషన్ల పరిధిలో 73.25 ఎకరాల భూమిలో 19 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేయనుంది.






