నేటి నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం

by Naga Rani Yarlagadda |

మే 21 నుంచి జూన్ 1 వరకు 12రోజుల పాటు జరిగే కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది

నేటి నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మే 21 నుంచి జూన్ 1 వరకు 12రోజుల పాటు జరిగే కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. పవిత్ర పుష్కర స్నానాలకు సుమారు 30 నుంచి 40లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పుష్కరాల పనుల కోసం ప్రభుత్వం రూ.30.63 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాది జరిగిన సరస్వతీ ఆది పుష్కరాల జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో పుష్కర ఘాట్ వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. పుష్కరఘాట్ పరిసరాల్లోని 23 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నచోట్ల బీటీరోడ్లు వేశారు. సుమారు 500 టాయిలెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం రెండు భారీ ట్యాంకులను నిర్మించారు.

5.43 గంటలకు తొలిస్నానం

పుష్కరాల తొలిరోజు గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాల్లో ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఉదయం హోమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల కోసం 90 షటిల్ బస్సులను నడిపిస్తున్నారు. రెస్క్యూ బృందాలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను సరస్వతీ నది ఘాట్ ప్రాంతంలో నియమించారు. అలాగే సెఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంచేశారు. పుష్కర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు మీడియా సెంటర్ ను సైతం ఏర్పాటు చేశారు.

ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.2కోట్లతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడి నాగేంద్రస్వామి ఆలయాన్ని రూ.30లక్షల వ్యయంతో పునర్ నిర్మాణం చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు నిర్వహించే హారతి, హోమాలు, తెప్పోత్సవానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. కాళేశ్వరం పుష్కర ఘాట్ లోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేశారు. అందుకోసం 300 మంది వైద్యాధికారులు, పారా మెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులను ఏర్పాటు చేశారు. మహాదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ ఆస్పత్రిగా సిద్ధం చేశారు.

245 ఎకరాల్లో పార్కింగ్

ఈసారి సరస్వతీ అంత్య పుష్కారాలకు 1.7లక్షల వాహనాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం 245 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏరియాలతో పాటు ఘాట్స్, టెంపుల్ తదితర ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వెళ్లే మార్గంలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లను బిగించారు. 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.

భక్తిశ్రద్ధలతో పుష్కరాలు: సీఎం రేవంత్ రెడ్డి

సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.

Next Story