- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల దిశగా ప్రభుత్వం.. కేకే నేతృత్వంలో కమిటి
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేకే నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారుల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇటీవలనే తెలంగాణ ఉద్యమకారులకు సబంధించి ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాంలతో కమిటి ఏర్పాటు అయింది. ఇటీవల కొంత కాలంగా మంత్రి పొన్నంతో తెలంగాణ ఉద్యమకారుల అంశంపైన అద్దంకి దయాకర్, కోదండరాం, పలువురు నేతలు అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. హామీల అమలుకు కమిటీని ఏర్పాటు చేయాలన్న యోచనతో కమిటిని నియమించారు. ఈ కమిటిగా ఏర్పడిన తర్వాత ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల కోసం చేపట్టే కార్యాచరణపై సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పలు అంశాలపైన చర్చించారు. గత ప్రభుత్వంలో గుర్తింపు పొందని ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకోవాలని కమిటి నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులను ఏబీసీల పేరిట మూడు కేటగిరులుగా విభజించి తెలంగాణ కోసం అమరులైన వారిని ఏ కేటగిరిలో, ఉద్యమంలో దివ్యాంగులైన వారిని బీ కేటరిలో, ఉద్యమంలో జైలుకు వెళ్లిన వారిని సీ కేటగిరిగా గుర్తించాలని కమిటి నిర్ణయించినట్లుగా కమిటి సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయాలనే అంశంపైన కమిటి దృష్టి సారించింది. ఇంటి స్థలం, గౌరవభృతి, గౌరవ పెన్షన్ అమలు వంటి కీలకాంశాలను కమిటి అద్యయనం చేస్తోందని, అన్ని అంశాలపైన స్పష్టత వస్తుందని సభ్యులు చెప్తున్నారు. మిగిలిన అంశాలపైన కసరత్తులు దాదాపుగా పూర్తి అయ్యాయని, అవసరమైతే మరోసారి సమావేశం అవుతామన్నారు. కాగా, సీఎం దృష్టికి తాము చర్చించిన అంశాలను తీసుకెళ్తామని తెలిపారు. సీఎంతో భేటీ అయిన తర్వాత ఈ అంశంపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల హామీలపైన కమిటి ఏర్పాటు పట్ల తెలంగాణ ఉద్యమకారులు సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సీఎంతో సమావేశం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల అంశంపై ప్రభుత్వం తీసుకునే కార్యాచరణ ఏవిధంగా ఉంటుందోనన్న ఆసక్తితో తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు..
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరియు తల్లి లేదా తండ్రి లేదా భార్యకు రూ.25000 లను గౌరవ పెన్షన్ గా నెలవారీగా అందజేస్తామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేడయంతో పాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఇస్తామన్నారు. దీనితో పాటుగా తెలంగాణ ఉద్యమకారులను సంక్షేమం పేరిట 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి, గౌరవ బృతిని అందజేస్తామని హామీని ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వం 585 మందిని తెలంగాణ ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారికి రూ. పది లక్షలను ఎక్స్ గ్రేషియాగా అందించింది.






