- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని.. అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీక అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

- జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ప్రారంభం
- గూడులేని ప్రతి పేద కుటుంబానికీ సొంత ఇల్లు
- జాయింట్ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
దిశ, తెలంగాణ బ్యూరో: పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని.. అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీక అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గూడులేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరును విజయవంతంగా పూర్తి చేసి లక్షలాది పేద కుటుంబాల సొంత ఇంటి కలలను నెరవేర్చామని తెలిపారు. 3 లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేయగా.. దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ కాగా.. ఇందులో ఇప్పటికే సుమారు 50 వేల గృహ ప్రవేశాలు సైతం జరిగాయన్నారు. మరో రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. మరో రెండు నెలల్లో పూర్తవుతాయని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 20 వేల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి సైతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. పేదవాడు తాను నివసిస్తున్న పూరి గుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే, తమ ల్యాండ్ అంటూ ఫారెస్ట్ అధికారులు గానీ, సింగరేణి యాజమాన్యం గానీ అడ్డుపడొద్దని సూచించారు. ఇండ్ల బేస్‌మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసులు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకల్లా వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 2 బీహెచ్‌కే ఇండ్లన్నిటికీ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉన్నదన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీ భూములున్నాయని.. రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. రెండు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశాల్లో ఖమ్మం ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు దాసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పార్లమెంటు సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, పి.బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.






