- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 70వేల ఉద్యోగాలిచ్చాం: సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ స్మృతివనం భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అందెశ్రీ గానాలు తనలో స్పూర్తిని నింపాయని అన్నారు. అందె శ్రీ తన పెద్దన్న అని ఆయనే తనకు స్పూర్తి అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: అందెశ్రీ గానాలు తనలో స్పూర్తిని నింపాయని అన్నారు. అందె శ్రీ తన పెద్దన్న అని ఆయనే తనకు స్పూర్తి అని చెప్పారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ రాష్ట్రగీతంగా మారి బడుల్లో, గుడుల్లో మోగుతుందని అంతా భావించారని కానీ దొర అహంకారంతో అందెశ్రీ పాటను, మాటను నిర్భందించారని ఆరోపించారు. అందెశ్రీ స్మృతివనం భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెన్నుల మీద మన్ను కప్పితే అవి గున్నులై మొలకెత్తినట్టు ఆ నిర్భందం నుండి తెంచుకుని ప్రతిగుడిలో, బడిలో అందెశ్రీ పాట వినిపిస్తుందని అన్నారు. అందెశ్రీ, గద్ధర్ లాంటి యుద్ధనౌకలతో పెట్టుకున్నోడు కాలగర్భంలో కలిసిపోతాడని ఆ రోజే చెప్పామన్నారు.
అందెశ్రీ కుటుంబాన్ని నడిపేందుకు కష్టపడినా దొరల మోకాళ్ల వద్ద మోకరిళ్లను అని అన్నాడని చెప్పారు. ప్రజలపై ఆధిపత్యం చెలాయించాలని కొందరు చూశారని, తెలంగాణను తమ కుటుంబమే తరతరాలు పాలించాలని భావించారన్నారు. అలాంటి సమయంలోనే అందెశ్రీ లాంటివాళ్లు వచ్చారన్నారు. ఈరోజు మేకతోలు కప్పుకున్న తోడేళ్ల లాంటి వాళ్లు బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నోటిఫికేషన్ లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడుతున్నారని, ఆనాడు మీ చెల్లిని నిజామాబాద్ లో ఓడిస్తే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారన్నారు.
మీ బంధువు వినోద్ కుమార్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మూడు నెలల్లోనే ఉద్యోగం ఇచ్చారన్నారు. వందల మంది మీ బంధులకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కానీ యువత ఉద్యోగాల కోసం ఒక్కరోజు కూడా ఆలోచించలేదన్నారు. నోటిఫికేషన్ లు ఇచ్చి జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలను పల్లి, బఠాణీల్లా పంచారని ఆరోపించారు. విద్యార్థులు పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి మీరు ఏనాడైనా వారి గురించి ఆలోచించారా అని అన్నారు. 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2026లో తాము నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టే వరకు 16ఏళ్లు అయ్యిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు 70వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. గతంలో ఖమ్మం, హైదరాబాద్ లో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణను శవాలమయంగా మార్చింది కేసీఆర్ కాదా అని అన్నారు.
గత పాలకులపై సీఎం విసుర్లు
గత పాలకుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాస్ పోర్ట్ బ్రోకర్ ను ప్రజలు సీఎం ను చేస్తే.. అమెరికాలో దొడ్లు కడిగేవాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణకు రూ.8 లక్షల కోట్ల అప్పులిచ్చిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. అప్పులు చేసింది నిజం కాకుండా.. నిజాంల కంటే ఆస్తిపరులు ఎలా అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ను గజ్వేల్ లోనే రాజకీయ సమాధి చేసే బాధ్యత తమదని పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి చాలా దోచుకున్నారన్న సీఎం.. గంజికి గతిలేని వారు కూడా బెంజికార్లకు ఓనర్లయ్యారని విమర్శించారు. రాష్ట్రం ఒక తులసివనమని, ఇక్కడ ఒక్క గంజాయి మొక్కను కూడా మొలకెత్తనివ్వమన్నారు. తెలంగాణను దోచుకున్నవారిని అసలే వదిలిపెట్టమన్నారు. నిజాంలకే దిక్కులేదు.. మీరెంత, మీ స్థాయి ఎంతంటూ గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.






