TG: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు: ప్రభుత్వ రియాక్షన్ ఇదే!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఘాటుగా స్పందించింది.

TG: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు: ప్రభుత్వ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రిఫైనరీల నుండి రాష్ట్రానికి ఇంధన సరఫరా ఎప్పటికప్పుడు సక్రమంగా జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజల నిత్యవసరాలకు, వాహనాల వినియోగానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో మరియు ఇతర మార్గాల్లో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారం జరగడం వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారని అధికారులు గుర్తించారు. "వదంతుల వల్ల ప్రజలు భయాందోళనకు లోనై, అవసరానికి మించి అకస్మాత్తుగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా రద్దీ ఏర్పడింది తప్ప, సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు" అని శాఖ పేర్కొంది.

ప్రజలకు విజ్ఞప్తి..

వంటగ్యాస్ (LPG) సరఫరాలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవని, సిలిండర్ల బుకింగ్ మరియు డెలివరీ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించి అనవసర క్యూలైన్లలో వేచి ఉండవద్దని పౌరసరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది.

Next Story