- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యశాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై 1వ తేదీకే వేతనాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

- ప్రతి నెల 1వ తేదీకే వేతనాలు
- డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జీతాల జమ
- సాంకేతిక కారణాలతో టీవీవీపీ ఉద్యోగులకు కాస్త ఆలస్యం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నాడే వేతనాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వేతనాల చెల్లింపులో సమయపాలన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నేరుగా ఖాతాల్లోకి డీబీటీ విధానం
ఈ కొత్త విధానంలో భాగంగా తొలిసారిగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, హానరేరియం ఉద్యోగుల వేతనాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రవేశపెట్టారు. థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ కానుండటంతో వేతనాల జమ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా కొనసాగనుంది. ఈ నెల నుంచే ఆరోగ్య శాఖ పరిధిలోని ఈ ఉద్యోగులందరికీ ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు జమ చేసే విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ పరిధిలోని అధిక శాతం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు విజయవంతంగా జమయ్యాయి.
సాంకేతిక కారణాలతో టీవీవీపీలో కాస్త ఆలస్యం
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సుమారు 1,700 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు డీబీటీ విధానాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నారు. ఈ నూతన సాంకేతిక ప్రక్రియ అప్‌డేట్ అవుతున్న నేపథ్యంలో కొన్ని స్వల్ప సాంకేతిక కారణాల వల్ల ఈ నెల వేతనాల జమలో స్వల్ప ఆలస్యం జరిగింది. అయితే వీరందరికీ సోమవారం నాటికి వేతనాలు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీవీవీపీ అధికారులు ఇప్పటికే పూర్తి చేయగా, సంబంధిత బిల్లులకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఉదయం కల్లా ఆయా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






