99 రోజుల కార్యాచరణపై సమీక్షలు.. జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌ల నియామకం

by Naga Rani Yarlagadda |

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

99 రోజుల కార్యాచరణపై సమీక్షలు.. జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌ల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కింద అమలు చేసిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగగా.. ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల అమలు, ఫలితాలపై సమగ్ర సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలోనూ ఇదే తరహాలో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. అందుకే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. సంబంధిత జిల్లాల్లో నెలనెలా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడంతోపాటు 99 రోజుల కార్యాచరణ అమలు, ఉత్తమ విధానాల డాక్యుమెంటేషన్, తదుపరి కార్యాచరణపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులోభాగంగా.. హైదరాబాద్ జిల్లాకు జయేష్ రంజన్, మేడ్చల్-మల్కాజిగిరికి వికాస్ రాజ్, రంగారెడ్డి జిల్లాకు సవ్యసాచి ఘోష్, మెదక్‌కు ఎ.వాణీ ప్రసాద్, యాదాద్రి భువనగిరికి బీఎండీ ఎక్కా, వికారాబాద్‌కు నవీన్ మిట్టల్, మహబూబ్‌నగర్‌కు దానా కిశోర్, సిద్దిపేటకు అహ్మద్ నదీమ్, రాజన్న సిరిసిల్లకు శైలజా రామయ్యర్, జయశంకర్ భూపాలపల్లికి ఎన్.శ్రీధర్, కరీంనగర్‌కు సందీప్ కుమార్ సుల్తానియా, సంగారెడ్డికి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తును నియమించారు. వీరు ప్రతినెలా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల అమలును పరిశీలించాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి సమీక్షల మాదిరిగానే జిల్లా స్థాయిలోనూ పురోగతిని అంచనా వేసి తదుపరి కార్యాచరణకు మార్గదర్శకాలు రూపొందించనున్నారు.

27లోపు నివేదికలు సమర్పించాలి: సీఎస్

రాష్ట్రంలో అమలు చేసిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఫలితాలు, సాధించిన పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టాలని ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. గ్రామ సభలు, వార్డు సభలు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, సూచనలను సమీక్షించి జిల్లా వారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో అందిన వినతులు, ఫిర్యాదులను పరిశీలించి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు సూచించాలని పేర్కొన్నారు. పీపీపీపీ అమలు కాలంలో చేపట్టిన ప్రత్యేక, ప్రచార, వినూత్న కార్యక్రమాలను గుర్తించి వాటిపై పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధి, విజయగాథలు, ఉత్తమ విధానాలు, కీలక ఫలితాలను ప్రతిబింబించేలా జిల్లా వారీగా పుస్తకాలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాల్లోని వివిధ శాఖల విజయాలు, ఉత్తమ పద్ధతులు, వినూత్న కార్యక్రమాలను గుర్తించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వ ప్రధాన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీడియా కథనాలు, ప్రచార సామగ్రి, విజయగాథలు, ఫొటోలు, వీడియోలను సమీకరించి ప్రత్యేక అధికారి నిర్వహించే ఫొటో ఎగ్జిబిషన్, మీడియా సమావేశాలకు ఉపయోగపడేలా సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో అమలైన ఉత్తమ విధానాలు, వినూత్న నమూనాలను గుర్తించి ఇతర జిల్లాల్లోనూ అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన అంశాలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించి, జిల్లా కలెక్టర్లకు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. కేటాయించిన జిల్లాల్లో ప్రత్యేక అధికారులు ఈ నెల 27వ తేదీలోపు పర్యటనలు పూర్తి చేసి, పరిశీలనలు, సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను ప్రణాళిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు.

Next Story