- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కారు నిర్ణయం
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే.. కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే.. కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని టీజీఎస్ ఆర్టీసీని ఆదేశించింది. ఓఆర్ఆర్ లోపల 2027 నాటికి 2,800 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని నిర్దేశించింది. దీంతో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సైతం ఏర్పాటు చేసుకుంటున్నది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలున్నాయి. అందులో ఆరు డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని డిపోల్లో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో చార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్ కో ద్వారా నిర్మించారు. రాబోయే 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా చార్జింగ్ స్టేషన్లతో కూడిన మరో 10 డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మౌలిక సదుపాయాలకు వచ్చే ఏడాది రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఈ మేరకు ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితి లేదని, దీంతో ప్రజల సహకారంతోనే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీ భావిస్తోంది.
అదనపు చార్జీలతో భారం తగ్గించుకునే ప్రయత్నం
ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు చార్జీలను విధించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఆర్టీసీ అదనపు చార్జీలను వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీని సంస్థ విధించనుంది.
అలాగే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీని వసూలు చేయనున్నారు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ అదనపు చార్జీ రేపటి నుంచి నుంచి అమల్లోకి రానున్నది. హైదరాబాద్ భవిష్యత్ బాగు కోసం రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలు ఆదరించాలని, నగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతున్న ఈ గ్రీన్ జర్నీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సంస్థ కోరుతోంది. ఈ పర్యావరణహిత కార్యక్రమానికి సహకరించి.. గతంలో మాదిరిగానే ఆర్టీసీ సేవలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తోంది.






